న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధం (1999) సమయంలో నటుడు నానా పటేకర్ చూపిన దేశభక్తికి సంబంధించిన ఆసక్తికర విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అప్పటికే నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఆయన.. సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి సైనికులతో కలిసి కార్గిల్ ప్రాంతంలో సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. కార్గిల్ యుద్ధం మొదలైన సమయంలో నానా పటేకర్ సైనికులతో కలిసి ముందువరుసలో సేవ చేయాలనుకున్నారు. ఇందుకోసం తొలుత మరాఠా లైట్ ఇన్‌ఫెంట్రీకి చెందిన సీనియర్ అధికారులను సంప్రదించారు. అయితే ఇందుకు రక్షణ మంత్రి అనుమతి అవసరమని వారు తెలిపారు. దీంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌కు నానా స్వయంగా ఫోన్ చేశారు.
నానా పటేకర్‌కు సైన్యంతో అప్పటికే అనుబంధం ఉంది. తన చిత్రం ‘ప్రహార్’ స్క్రిప్ట్ రాసే సమయంలో మరాఠా లైట్ ఇన్‌ఫెంట్రీతో కలిసి దాదాపు మూడేళ్లు శిక్షణ పొందారు. సాధారణంగా కమిషన్ కోసం ఆరు నెలల శిక్షణ ఉంటుందని, అయితే తాను మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందినట్లు నానా రక్షణ మంత్రికి వివరించారు. ఆయన అనుభవం తెలుసుకున్న జార్జ్ ఫెర్నాండెజ్ కార్గిల్ వెళ్లేందుకు అనుమతించినట్లు నానా తెలిపారు.
1999 ఆగస్టులో నానా పటేకర్ నియంత్రణ రేఖకు సమీపంలోని ప్రాంతంలో రెండు వారాలకు పైగా గడిపారు. అక్కడ సైనికులకు సహాయం చేయడంతో పాటు కొన్ని రోజుల పాటు సైనిక స్థావరంలోని ఆసుపత్రిలోనూ సేవలందించారు. తాను క్విక్ రెస్పాన్స్ టీమ్‌లో కూడా భాగంగా ఉన్నట్లు ఆయన తరువాత వెల్లడించారు. కార్గిల్‌లోని క్లిష్ట పరిస్థితుల ప్రభావం తనపై ఎంతగా పడిందో నానా గతంలో చెప్పుకొచ్చారు. శ్రీనగర్ చేరుకునే సమయంలో తన బరువు 76 కిలోలు ఉండగా.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలకు తగ్గిపోయిందని తెలిపారు. అంటే అక్కడ ఉన్న సమయంలో ఏకంగా 20 కిలోల బరువు తగ్గినట్లు ఆయన చెప్పారు.
నానా పటేకర్ నటుడిగా మాత్రమే కాకుండా సైన్యం పట్ల గౌరవం, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు సహాయం చేసే వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో సినిమాల కంటే దేశసేవకు ప్రాధాన్యం ఇచ్చి సైనికులతో కలిసి ఉండాలనే ఆయన నిర్ణయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.


