ముంబై: స్కూల్‌ లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళా టీచర్‌ మృతి

Mumbai Teacher Gets Stuck Between Moving Lift Doors At Malad School - Sakshi

ముంబై: స్కూల్‌ లిఫ్ట్‌లో ఇరుక్కొని 26 ఏళ్ల మహిళా టీచర్‌ మృతి చెందింది. ఈ విషాద ఘటన మహరాష్ట్ర రాజధాని ముంబై నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నార్త్‌ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్‌లోని సెయింట్‌ మేరీస్‌ ఇంగ్లీష్‌ హైస్కూల్‌లో జెనెల్‌ ఫెర్నాండేజ్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆరో అంతస్తులో క్లాస్‌ పూర్తి చేసుకున్న జెనెల్‌.. రెండో అంతస్తులోని స్టాఫ్‌ రూమ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌ కోసం వేచి ఉంది.

లిఫ్ట్‌లోకి ఎక్కి రెండో ఫ్లోర్‌ బటన్‌ నొక్కింది. అయితే లిఫ్ట్‌ పపైకి వెళ్లడం గమనించిన జెనెల్‌ అప్పటికీ లిఫ్ట్‌ తలపులు మూసుకోకపోవడంతో వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. బయటకు వస్తుండగా ఆమె బ్యాగ్‌ లిఫ్ట్‌లో చిక్కుకుంది. బ్యాగ్‌ను తీసుకునేందుకు టీచర్‌ ప్రయత్నించగా.. లిఫ్ట్‌లో ఆమె తల ఇరుక్కుపోయింది. లిఫ్ట్‌ డోర్స్‌ మధ్యలో చిక్కుకొని జెనెల్‌ తల నుజ్జునుజ్జైంది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన టీచర్‌ కేకలు విన్న పాఠశాల అధికారులు, సహోద్యోగులు ఆమెకు సాయం చేసేందుకు పరుగెత్తుకొచ్చారు.

సుమారు 20 నిమిషాలు కష్టపడి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువతిని బయటకు తీశారు. వెంటనే ఆమెను గోరేగావ్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై మృతురాలి భర్తకు సమాచారం అందించారు పోలీసులు. ఫెర్నాండెజ్ ఈ ఏడాది జూన్‌లోనే ప్రైమరీ విభాగంలో అసిస్టెంట్ టీచర్‌గా  చేరింది. మృతురాలి బంధువుల్లో ఒకరు కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
చదవండి: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top