పీటర్‌ పాన్‌ సిండ్రోమ్‌: అత్యాచార నిందితుడికి బెయిల్‌

Mumbai Man With Peter Pan Syndrome Gets Bail In Minor Molestation Case - Sakshi

అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసిన ముంబై కోర్డు

సాక్షి, ముంబై: 'పీటర్ పాన్ సిండ్రోమ్'తో బాధపడుతున్నందును తన క్లయింట్‌కు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా కోరిన లాయర్‌ అభ్యర్థన మేరకు ముంబై కోర్టు పోక్సో యాక్ట్‌ కింద అరెస్ట్‌ అయిన 23 ఏళ్ల వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు 14 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశాడనే ఆరోపణల మేరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం బాధితురాలినే వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన ఈ ఏడాది ఏప్రిల్‌లో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. 

ఈ సందర్భంగా నిందితుడి తరఫున లాయర్‌ మాట్లాడుతూ.. ‘‘నిందితుడికి, బాధితురాలికి మధ్య ఉన్న సంబంధం గురించి ఆమె కుటుంబ సభ్యులకు తెలుసు. కాకపోతే అతడు పేదవాడు కావడం, పీటర్‌ పాన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నందున వారి వివాహానికి బాధితురాలి కుటుంబం అంగీకరించలేదు. అతనిపై కక్ష్య కట్టి ఇలా కేసు నమోదు చేశారు. కానీ బాధితురాలికి అతడంటే ఇష్టం. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఆమె తన ఇష్టపూర్తిగానే అతడిని వివాహం చేసుకుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులు కావాలనే అతడి మీద కిడ్నాప్‌ కేసు పెట్టారు’’ అని కోర్టుకు తెలిపాడు. 

ఈ క్రమంలో కోర్టు సదరు నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులో బాలికకు వారి బంధం గురించి పూర్తిగా తెలుసని.. ఆమె స్వచ్ఛందంగానే అతడితో కలిసి ఉంటుందని పేర్కొంది. పైగా నిందితుడికి ఎటువంటి క్రిమినల్ రికార్డ్‌ లేదని, అతన్ని కస్టడీలో ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కోర్టు తెలిపింది.

పీటర్‌ పాన్‌ సిండ్రోమ్‌...
పీటర్ పాన్ అనేది నెవర్-నెవర్ ల్యాండ్ అనే పౌరాణిక ప్రదేశం నుంచి వచ్చిన కల్పిత పాత్ర. ఇక్కడ పిల్లలు ఎప్పటికీ పెరగరు. ఈ సిండ్రోమ్ ఉన్నవారు మానసికంగా సరిగా ఎదగరు. పరిపక్వత కలిగి ఉండరు.. యుక్త వయసు వారి మాదిరిగా బాధ్యతలను స్వీకరించలేరు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మానసిక రుగ్మతగా గుర్తించలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top