ముంబై: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు నేడు(శుక్రవారం) వెల్లడికానున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్.. అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించవచ్చనే అంచనా వేశాయి. అయితే.. విపక్ష కూటమి మాత్రం తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. మహారాష్టలోని ముంబై, పూణేలతో పాటు పింప్రి-చించ్వాడ్, కొల్హాపూర్, వసాయ్-విరార్, కళ్యాణ్-డోంబివిలి, నాగ్‌పూర్, సోలాపూర్, అమరావతి, థానే, పర్బానీ తదితర మున్సిపాలిటీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 893 వార్డుల్లోని 2,869 సీట్ల కోసం ఈ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 15,931 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో ముంబై నుంచి 1,700 మంది, పూణే నుంచి 1,166 మంది అభ్యర్థులు ఉన్నారు.
గురువారం జరిగిన పోలింగ్‌లో దాదాపు 1.03 కోట్ల మంది ఓటర్లు 1,700 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. దక్షిణ ముంబైలో ఓటింగ్ శాతం నిరాశాజనకంగా నమోదైంది. ముఖ్యంగా కులాబా ప్రాంతం (వార్డు 227)లో మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి కేవలం 15.73 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇది ముంబై సగటు పోలింగ్ శాతం 41.08 కన్నా చాలా తక్కువ. 2017 ఎన్నికల్లోనూ ఇక్కడ తక్కువ పోలింగ్ నమోదు కాగా, ఈసారి కూడా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావడానికి ఆసక్తి చూపలేదు. హౌసింగ్ సొసైటీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అధికారులు తెలిపారు.
‘యాక్సిస్ మై ఇండియా’ అంచనాల ప్రకారం.. మొత్తం 227 వార్డులకు గాను బీజేపీ-శివసేన కూటమి 42 శాతం ఓటు షేర్‌తో 131 నుంచి 151 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరేలు చేతులు కలిపినప్పటికీ, మహా వికాస్ అఘాడి (శివసేన యూబీటీ-ఎంఎన్‌ఎస్- ఎన్‌సీపీ(ఎస్‌పీ)కూటమి 58-68 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి కేవలం 12-16 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
బీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు (జనవరి 16) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపు 2,299 మంది అధికారులు తమ విధులను నిర్వహించనున్నారు. విక్రోలి, కాందివలిలోని స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఉదయం 11 గంటల కల్లా ఫలితాల సరళిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114 కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహాయుతి ఈ మార్కును సులభంగా దాటేస్తుందని భావిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిన తర్వాత జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పోరులో ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తమ కూటమి 150 సీట్లకు పైగా గెలుచుకుంటుందని, మేయర్ పీఠంపై మరాఠీ హిందువే కూర్చుంటారని శివసేన నేత రాజు వాఘ్మారే ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు మహారాష్ట్ర భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపనున్నాయి.


