కరోనా కన్నా టీబీ మరణాలే ఎందుకు ఎక్కువ?

More tuberculosis Deaths Rather Than Covid in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్, టీబీ (ట్యూబర్‌కులోసిస్‌) సోకిన వారిలో కామన్‌గా కనిపించే లక్షణం దగ్గు. దగ్గు తీవ్రతను బట్టి రోగ తీవ్రతను అంచనా వేయవచ్చు. కాస్త దమ్ము రావడం కూడా కామన్‌గా కనిపించే లక్షణమే. టీబీ రాకుండా నిరోధించేందుకు వ్యాక్సిన్‌ ఉంది. టీబీని సకాలంలో గుర్తిస్తే నయం చేసేందుకు మందులు ఉన్నాయి. అదే కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పుడు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. నయం చేసేందుకు సరైన మందు ఇప్పటికి అందుబాటులోకి రాలేదు. దేశంలో టీబీ వల్ల రోజుకు 1200 మంది మరణిస్తుంటే కరోనా వైరస్‌ వల్ల అందులో సగం మంది కూడా మరణించడం లేదు.

కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు రోజుకు వెయ్యి మందికి పైగా మరణించగా, ఇప్పుడు మరణాల సంఖ్య రోజుకు 500ల దిగువకు పడిపోయింది. అయినా భారతీయులు నేటికి టీబీకి భయపడడం లేదుగానీ కరోనాకు భయపడుతున్నారు. టీబీతో పోలిస్తే కరోనా ఒకరి నుంచి ఒకరి అది వేగంగా విస్తరించడమే భయానికి కారణం కావచ్చు. అయితే కరోనా కట్టడి చేయడంలో తలముక్కలై ఉన్న వైద్యాధికారులు టీబీ రోగులను పూర్తిగా విస్మరించారు. గడచిన ఏడాదిలో పుల్మరో టీబీ (ముందుగా ఊపిరి తిత్తులకు వ్యాపించి అక్కడి నుంచి ఇతర అవయవాలకు విస్తరించడం)తో బాధ పడుతున్న వారు వైద్య పరీక్షల కోసం ల్యాబ్‌లకుగానీ ఆస్పత్రులకుగానీ వెళ్లలేదు. అందుకు వారికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం ప్రధాన కారణం కాగా, వెళ్లిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లోగానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో గానీ టీబీ మందులు దొరకలేదు.

టీబీ రోగులకు రెండు, మూడు నెలలకు సరిపోయే మందులను ముందస్తుగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కరోనా కారణంగా అదీ జరగలేదు. అనేక మంది టీబీ రోగులు కూడా కరోనా కాబోలనుకొని పరీక్షలు చేయించుకొని నెగటివ్‌ అని తేలగానే ఇంటికి వచ్చారు. కరోనాతోపాటు టీబీ పరీక్షలు నిర్వహించడం కాస్త క్లిష్టమైన విషయం కావడంతో భారత వైద్యులు టీబీ పరీక్షలను పూర్తిగా విస్మరించారు. పర్యవసానంగా వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ టీబీని సకాలంలో గుర్తిస్తే చికిత్సతో సులభంగానే నయం చేయవచ్చు. (చదవండి: ఏ వ్యాక్సిన్‌కు ఎంత సమయం?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top