మనసులో అలజడి

Mental Problems Increased With The Covid Disaster - Sakshi

మనసు దృఢంగా ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. కానీ అదే మనసు కల్లోలమైతే జీవితమే అంధకారమవుతుంది. కోవిడ్‌ రక్కసి మానసిక అలజడులకూ కారణమైంది. తీవ్రమైన ఆర్థిక సామాజిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది మనో వ్యాకులతకు గురయ్యారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలుచోట్ల జాగృతి కార్యక్రమాలు జరిగాయి.

బనశంకరి: కోవిడ్‌ మహమ్మారి వేటుకు సమాజంలో ఎక్కువమంది బడుగులు, మధ్య తరగతి వారే కాదు సంపన్నులు కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుంగిపోయారు. వైరస్‌ భయం, లాక్‌డౌన్, ఉద్యోగాలను, ఆప్తులను కోల్పోవడం వంటి ఎన్నో వ్యతిరేకాంశాలతో క్లేశం అనుభవించారు.

కర్ణాటకలో కోవిడ్‌ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మానసిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందినవారి సంఖ్య ఏడాదిలో 10 లక్షలు ఉంది.  ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ ఇంకా ఎక్కువమందే మానసిక సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లి ఉంటారని ఎన్జీవోల అంచనా.  

కోవిడ్‌ సమస్యలతో కుంగుబాటు  

  • మానసిక సమస్యలకు కారణాలు అనేకం. కోవిడ్‌ వల్ల, ఆపై తలెత్తిన ఒంటరితనం ప్రధాన కారణం. ఉద్యోగాలు, వ్యాపారాలను కోల్పోవడం, ప్రేమ వైఫల్యం, జీవితంపై అభద్రత తదితర కారణాలతో ప్రజలు తీవ్రంగా కలత చెందారు.  
  • బాధితుల్లో చిన్నపాటి మానసిక సమస్యలు 34 శాతం ఉండగా, మతి చలించడం వంటి తీవ్ర సమస్యకు లోనైనవారు 18.4 శాతం ఉన్నారు. మద్య వ్యసనం, ఓ మోస్తరు మానసిక సమస్యల కేసులు 11.2 శాతం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.  
  • కౌన్సెలింగ్‌ సెంటర్లకు వరదలా కాల్స్‌  
  • కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మానసిక కౌన్సెలింగ్‌ కేంద్రాలకు భారీ సంఖ్యలో కాల్స్‌ వచ్చాయి. 
  • 27 లక్షల మందికి పైగా ప్రజలు ఫోన్‌ చేసి ధైర్యంగా ఉండడానికి సాయం కోరారు.  
  • 2020–21 లో 9 లక్షల మంది సంప్రదించగా, ఈ ఏడాది 10 నెలల్లోనే 8.65 లక్షల మంది ఫోన్‌ చేశారు. దీనిని బట్టి కోవిడ్‌ తరువాత మానసిక సంఘర్షణ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది.  
  • కోవిడ్‌ వేళ టీవీల్లో, సోషల్‌ మీడియాలో వచ్చిన మృతుల దృశ్యాలు మహిళలను ఎక్కువగా భయాందోళనకు గురిచేశాయి.  
  • బలవన్మరణాల బెడద  
  • బలవన్మరణాల బెడద  
  • 2021లో దేశవ్యాప్తంగా 1.64 లక్షలమంది ఆత్మహత్యకు పాల్పడగా, అందులో 18 ఏళ్లలోపు వారు 13,089 మంది ఉన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారు 37 వేలమంది ప్రాణాలు తీసుకున్నారు.  
  • కర్ణాటకలో 2021లో 13 వేలమంది ఆత్మహత్య చేసుకోగా, ఈ సమస్య ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు 3వ స్థానంలో ఉంది. నగరంలో 2,292 మంది ఆత్మహత్యకు ఒడిగట్టారు.  

మానసిక ఆరోగ్యంపై జాగృతి 
మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల్లో జాగృతం చేయాలి. మానసిక రోగుల పట్ల చిన్నచూపు తగదు అని నిమ్హాన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రతిమా మూర్తి అన్నారు. 

మంచి అలవాట్లు ముఖ్యం  
నిమ్హాన్స్‌ మానసిక విజ్ఞాన విభాగ అధ్యాపకుడు డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ శర్మ మాట్లాడుతూ సోయల్‌ మీడియాను అతిగా వినియోగించిన వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. దీనికి బదులు బయట వాకింగ్, వ్యాయామం చేయడం, అందరితో కలవడం, ఖాళీగా లేకుండా చూసుకోవడం ముఖ్యమని సూచించారు. 

(చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top