
మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు
ఓ కోళ్ల దుకాణంలో కొన్ని కోళ్లను నీలకంఠ భూమియా దొంగిలించాడు. దీనికి సంబంధించి, ఓ వీడియో...
జయపురం: మనస్తాపానికి గురై నీలకంఠ భూమియా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బొరిగుమ్మ సమితిలోని ఖెందుగుడ గ్రామంలో మంగళవారం కలకలం రేపింది. ఈ నెల 26వ తేదీన బొరిగుమ్మ సమితి కార్యాలయం దగ్గరున్న ఓ కోళ్ల దుకాణంలో కొన్ని కోళ్లను నీలకంఠ భూమియా దొంగిలించాడు. దీనికి సంబంధించి, ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న నీలకంఠ భూమియా తనపరువు అంతా పోయిందని, గ్రామస్తులకు తన ముఖం ఎలా చూపించుకోవాలని మదనపడ్డాడు. చావే శరణ్యమని తనకు వేరే దారి లేదని అనుకుని,ఉరేసుకున్నాడు.
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు రహదారిపై మృతదేహాన్ని ఉంచి, నిరసన వ్యక్తం చేశారు. నింది తులను తక్షణమే శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం గురించి తెలుసుకున్న బొరిగుమ్మ పోలీసులు హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా నిందితులకు శిక్ష పడేంత వరకు తమ ఆందోళన విరమించమని వారు తెగేసి చెప్పగా, విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబానికి పోలీసులు అప్పగించారు.