
భర్త హత్య కేసులో ప్రొఫెసర్‌కు జీవిత ఖైదు
తన కేసు తానే వాదించుకుని సంచలనమైన మమతా పాఠక్
ఛతర్‌పూర్: భర్త హత్య కేసులో కోర్టులో తానే వాదించుకుని సంచలనంగా మారిన మాజీ ప్రొఫెసర్ మమతా పాఠక్‌కు జీవిత ఖైదు పడింది. జిల్లా కోర్టు తీర్పును పునరుద్ఘాటించిన మధ్యప్రదేశ్ హైకోర్టు 97 పేజీల వివరణాత్మక తీర్పు ఇచ్చింది. రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ నీరజ్ పాఠక్ 2021లో తన సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. మొదట విద్యుత్ షాక్‌తో మరణించారని నమోదు చేసిన పోలీసులు.. పోస్ట్‌మార్టం ఫలితాలు, పరిశోధనల తరువాత అతని భార్య, మమతా పాఠక్‌పై హత్యా అభియోగం మోపారు. ఆమెను దోషిగా 2022లో కోర్టు తేలి్చంది. జీవిత ఖైదు విధించింది. అయితే మానసిక వికలాంగుడైన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరైంది.
జిల్లా కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) జబల్పూర్ బెంచ్‌లో అప్పీల్ చేసుకుంది. కోర్టులో తన కేసు తానే వాదించింది. ఆ సందర్భంగా.. వేడి వల్ల కాలిన గాయాలు, విద్యుత్ షాక్‌తో కలిగిన గాయాలు ఒకేలా కనిపిస్తాయని, రసాయన విశ్లేషణ మాత్రమే వాటి తేడాను కనిపెట్టగలదని వాదించారు. ఆమె వాదన కోర్టును దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘ఆ విషయం చెప్పడానికి మీరు కెమిస్ట్రీ ప్రొఫెసరా?’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఆమె అవునని సమాధానం ఇచ్చారు. ఆమె తార్కిక విధానం, అత్యంత ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా వాదించడం, హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆమె ధైర్యం కోల్పోకపోవడం వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.
ఈ కేసును తీవ్రంగా పరిగణించిన కోర్టు మమతా పాఠక్‌కు న్యాయమైన విచారణ జరిగేలా చూసేందుకు సీనియర్ న్యాయవాది సురేంద్ర సింగ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. సుదీర్ఘ చర్చలు, సాక్ష్యాల తరువాత పరిస్థితులు ఆమె నేరం చేసినట్టు స్పష్టంగా ఉందని కోర్టు గమనించింది. సుప్రీంకోర్టు తీర్పులు, న్యాయపరమైన పూర్వాపరాలను ప్రస్తావించిన కోర్టు.. మమతా పాఠక్‌ను దోషిగా తేల్చిఇంది. జీవిత ఖైదు (Life Term) విధించింది.