
రూ.15,000 కోట్ల ఆస్తులు ఎవరివో తేల్చాలి
మళ్లీ విచారణ జరపాల్సిందే
ట్రయల్ కోర్టుకు భోపాల్ హైకోర్టు ఆదేశం
జబల్పూర్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌తోపాటు ఆయన కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులకు వారసులు ఎవరన్నదానిపై మళ్లీ విచారణ చేపట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఏడాదిలోగా విచారణ పూర్తిచేయాలని నిర్దేశించింది.
ఆ ఆస్తులు పటౌడీ కుటుంబానికి (సైఫ్ అలీఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా అలీఖాన్, సబా అలీఖాన్) చెందుతాయంటూ 20 ఏళ్ల క్రితం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, డిక్రీని హైకోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ ద్వివేదితో కూడిన సింగిల్ బెంచ్ జూన్ 30న ఉత్తర్వు జారీ చేసింది. రూ.15,000 కోట్ల ఆస్తులకు వారసులు ఎవరో గుర్తించడానికి మళ్లీ విచారణ జరపాల్సిందేనని ట్రయల్ కోర్టుకు స్పష్టంచేసింది.
అసలు ఏమిటీ వివాదం?
భోపాల్ సంస్థానానికి చివరి పాలకుడు నవాబ్ హమీదుల్లా. ఆయనకు భార్య మైమూనా సుల్తాన్, ముగ్గురు కుమార్తెలు అబీదా, సాజీదా, రబియా ఉన్నారు. సాజీదా పటౌడీ సంస్థాన వారసుడు ఇఫ్తికార్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. వారి కుమారుడే మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఆయన క్రికెటర్‌గా పేరుప్రఖ్యాతలు సంపాదించారు. బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్‌ను ప్రేమవివాహం చేసుకున్నారు.
వీరికి సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్, సబా అలీఖాన్ జని్మంచారు. నవాబ్ హమీదుల్లా పెద్ద కుమార్తె అబీదా దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డారు. దాంతో సాజీదా భోపాల్‌లోని ఆస్తులకు వారసురాలయ్యారు. అనంతరం మన్సూర్ అలీఖాన్‌కు.. సైఫ్ అలీఖాన్, ఆయన సోదరీమణులకు ఆ ఆస్తులు వారసత్వంగా వచ్చాయి.
దివంగత నవాబ్ హమీదుల్లా కుటుంబ సభ్యులైన బేగం సురయ్యా రషీద్, నవాబ్ మెహర్ తేజ్ సాజీదా తదితరులు 1999లో కోర్టుకెక్కారు. ఆస్తుల్లో తమకు వాటా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిని భోపాల్ జిల్లా కోర్టు తిరస్కరించింది. ఆస్తులకు పటౌడీ కుటుంబమే యజమాని అంటూ 2000 ఫిబ్రవరి 14న తీర్పు వెలువరించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ బేగం సురయ్యా రషీద్, నవాబ్ మెహర్ తేజ్ సాజీదా తదితరులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నవాబ్ హమీదుల్లా వారసురాలిగా సాజీదాను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1962 జనవరి 10 సరి్టఫికెట్ జారీ చేసిందని, ఆ ఆస్తులన్నీ తమకే చెందుతాయని పటౌడీ కుటుంబ సభ్యులు స్పష్టంచేశారు. ఈ వాదనను పిటిషనర్లు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో పిటిషన్లు ప్రాథమికంగా 1999లో దాఖలయ్యాయి కాబట్టి మళ్లీ విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.