ఏపీలో ‘దిశ’లాగే మహారాష్ట్రలో ‘శక్తి’..

Maharashtra Assembly Unanimously OKs Shakti Bill - Sakshi

ఆదిత్య ఠాక్రేకు బెదిరింపు కాల్‌పై రెండో రోజు అసెంబ్లీలో రచ్చ

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని ఫడ్నవీస్‌ ఆగ్రహం  

సాక్షి, ముంబై: మొదటి రోజు మాదిరిగానే రెండో రోజూ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాపీ (అనుకరణ), మాఫీతో గరంగరంగా సాగిన కార్యకలాపాలు రెండో రోజు కూడా దాదాపు అలాగే కొనసాగాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ప్రారంభమైన గురువారం నాటి సభా కార్యకలాపాలు చివరకు ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకోసం తీసుకువచ్చిన ‘దిశ’ లాంటి చట్టాన్ని ‘శక్తి’ పేరుతో అమలు చేయాలనే ప్రతిపాదనను ఆమోదించుకున్నాయి. ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి. ఇదిలాఉండగా సభ కార్యకలాపాల ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నేతలందరూ అసెంబ్లీ హాలులోకి వెళ్లే మెట్లపై కూర్చున్నారు. అదే సమయంలో పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే రావడంతో మెట్లపై గుంపులో కూర్చున్న ఎమ్మెల్యే నితేశ్‌ రాణే ఆయన్ని చూస్తూ మ్యావ్, మ్యావ్‌ అంటూ శబ్ధం చేశారు.

ఒకప్పుడు పులిలా గాండ్రించే శివసేన పార్టీ ఇప్పుడు పిల్లిలా మారిందని, దీన్ని గుర్తు చేయడానికే ఇలా మ్యావ్, మ్యావ్‌ మంటూ శబ్ధం చేశానని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆదిత్య ఠాక్రే నితేశ్‌ రాణేను పట్టించుకోకుండా నేరుగా ముందుకు వెళ్లిపోయారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే సభా ప్రాంగణంలో కొందరు సభ్యులు మాస్క్‌ లేకుండా తిరుగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ గమనించారు. దీంతో మాస్క్‌ ధరించని సభ్యులను (పరోక్షంగా బీజేపీ నాయకులు) సభ నుంచి బయటకు పంపించాలని డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిరావల్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్‌ ప్రభూ మాట్లాడుతూ ఆదిత్య ఠాక్రేకు వాట్సాప్‌లో బెంగళూర్‌ నుంచి బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చిందని, అది కర్నాటక నుంచే వచ్చిందని అన్నారు.

చదవండి: (‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్‌)

గతంలో దాబోల్కర్, పాన్సారేలను హత్య చేసిన హంతకులకు కర్నాటకతో సంబంధాలున్నాయి. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందని ఘటనకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీల్‌ ప్రభూ ఈ అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని, అవసరమైతే తాను స్వయంగా కర్నాటక ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫడ్నవీస్‌ సభకు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన హంతకులతో సంబంధాలున్నట్లా? అన్ని ప్రశ్నిస్తూనే, సాక్షాలు లేనిదే అనవసరంగా ఆరోపణలు చేయవద్దని సభ్యులకు ఫడ్నవీస్‌ హితవు పలికారు. 

చదవండి: (Flight Charges: విమాన చార్జీల మోత)

కొత్త చట్టంతో మహిళలకు సత్వర న్యాయం 
మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాల ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నా, నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం మాదరిగానే ‘శక్తి’ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎమ్మెల్యే అనిల్‌ దేశ్‌ముఖ్‌ అన్నారు. ఆ ప్రకారం శక్తి చట్టాన్ని అమలుచేసేందుకు రూపొం దించిన బిల్లుపై గత సంవత్సరం జరిగిన ఆర్థిక బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించారు. ఈ చట్టం ద్వారా సమాజంలో మహిళలపై జరిగే వేధింపు లు, యాసిడ్‌ దాడులు, అసభ్యకర ప్రవర్తన తదిత ర నేరాలపై నాన్‌బెయిల్‌ కేసు నమోదు చేస్తారు.

కేసు నమోదు చేసిన నెల రోజుల్లోనే విచారణ  జరిపి తీర్పు వెల్లడించడం, ప్రతి జిల్లాలో దీనికోసం స్వతంత్రంగా దర్యాప్తు సంస్ధలు, ప్రత్యేక కోర్టులు స్ధాపించడం లాంటివి ఈ చట్టం ద్వారా సాధ్యమవుతుంది. రెండోరోజు జరిగిన సమావేశంలో శక్తి చట్టాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించుకున్నాయి. అందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాయి. దీంతో ఇకనుంచి యాసి డ్‌ దాడులు, సామూహిక అత్యాచారం, హత్య చేసిన నిందితులకు సత్వరమే శిక్షలు విధించేందుకు ప్రత్యేక కోర్టు స్ధాపించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజీత్‌ పవార్‌ సభకు వెల్లడించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top