లక్నో: కుప్పకూలిన నాలుగంతస్థుల బిల్డింగ్‌.. శిథిలాల కింద పదుల సంఖ్యలో..!

Lucknow Building Collapses Rescue Operation Updates - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో మంగళవారం సాయంత్రం ఘోరం జరిగింది. నాలుగు అంతస్థుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అరవై మంది దాకా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మూడు మృతదేహాలను వెలికి తీశారు సహయక బృందాలు.

వజీర్ హసన్‌గంజ్ రోడ్‌లోని  ఓ నివాస సముదాయం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కూలిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే.. పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

మంగళవారం ఉత్తరాఖండ్‌ కేంద్రంగా ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి భారీగా కంపించిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేల్‌పై 5.8 తీవ్రతే అయినా.. ప్రకంపనలు మాత్రం భారీగా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. ఈ తరుణంలో ఈ ప్రకంపనలకు, ఈ పాత బిల్డింగ్‌ కూలిపోవడానికి సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు సమీక్షిస్తున్నారు. మరోవైపు సిలిండర్‌ పేలుడుతోనే భవనం కూలిందన్న చర్చా అక్కడ నడుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

వజీర్ హసన్‌గంజ్ రోడ్‌, హజ్రత్‌గంజ్ ప్రాంతమంతా పాత భవనాలకు నిలయం. ప్రస్తుతం కుప్పకూలిన భవనాన్ని అలయా అపార్ట్‌మెంట్స్‌ భవనంగా తెలుస్తోంది. సహాయక చర్యల నేపథ్యంలో అక్కడ హాహాకారాలు వినిపిస్తున్నాయి. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top