తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కేరళ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, మైనారిటీలు, వలస కార్మికులు, అణగారిన వర్గాలు యువ ఓటర్ల ఓటు హక్కును సాంకేతిక మార్పులతో తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు భంగం కలుగుతోందని ఆరోపించారు. కనుక ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడటానికి సీఈసీని తొలగించాలని తీర్మానం చేశారు.
అంతేకాకుండా ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌ను పునర్వ్యవస్థీకరించాలని ఆ ప్యానెల్‌లో ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత, సీజేఐ సభ్యులుగా ఉండాలని సూచించారు. ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) బలపరిచింది.
ఇదీ చదవండి: సీఈసీకి వ్యతిరేకంగా విపక్షాల ర్యాలీ


