దేశంలోనే తొలి ‘వర్చువల్‌ స్కూల్‌’ ప్రారంభించిన కేజ్రీవాల్‌

Kejriwal Launches Virtual School For Students Across The Country - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలి వర్చువల్‌ స్కూల్‌ను ప్రారంభించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థలు ఈ స్కూల్‌లో చేరేందుకు అర్హులేనని తెలిపారు. ఢిల్లీ మోడల్‌ వర్చువల్ స్కూల్‌-డీఎంవీఎస్‌లో బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. 9-12వ తరగతి వరకు 13 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్‌, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు వర్చువల్‌ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తామని తెలిపారు కేజ్రీవాల్‌.  

ఢిల్లీ మోడల్‌ వర్చువల్ పాఠశాలను దేశ విద్యారంగంలో మైలురాయిగా అభివర్ణించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌. ‘దూరం వంటి అనేక కారణాలతో చాలా మంది పిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారు. అమ్మాయిలను దూరప్రాంతాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడంలేదు. అలాంటి వారందరి కోసమే ఢిల్లీ వర్చువల్‌ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. వర్చువల్‌ విధానంలోనే తరగతులు జరుగుతాయి. టీచర్లు పాఠాలు చెప్పే వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.’ అని వెల్లడించారు కేజ్రీవాల్‌. 

ఢిల్లీ బోర్డ్ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఈ వర్చువల్ స్కూల్‌ పనిచేస్తుంది. మార్కుల మెమోలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు అన్నీ డీబీఎస్ఈ జారీ చేస్తుంది. ఇవి ఇతర బోర్డులు ఇచ్చే ధ్రువపత్రాలతో సమానం. వీటి ఆధారంగా విద్యార్థులు అండర్​ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు. వర్చువల్ స్కూల్‌లో చేరే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయరు. తొలి బ్యాచ్‌లో ఎంత మంది విద్యార్థులను తీసుకోవాలో ఇంకా ఏమీ నిర్ణయించలేదని, రిజిస్ట్రేషన్ల ఆధారంగా నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు.  

స్కూల్​నెట్, గూగుల్ కలిసి అభివృద్ధి చేసిన స్కూలింగ్ ప్లాట్​ఫాం ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారు. విద్యార్థుల అటెండన్స్​ తీసుకునేందుకు ఈ ఆన్‌లైన్​ ప్లాట్​ఫాంలోనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. పరీక్షలు వర్చువల్​ మోడ్​లో జరిగినా కాపీకి ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కో టాపిక్‌పై విద్యార్థుల అవగాహనను తెలుసుకునేలా పరీక్షలు ఉంటాయి. వీటిలో కాపీ కొట్టేందుకు అవకాశాలు చాలా తక్కువ. అయితే.. రెండు టెర్మ్​-ఎండ్ పరీక్షల కోసం విద్యార్థులు తప్పనిసరిగా ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి. వర్చువల్ స్కూల్​లో ఇంగ్లీష్‌, హిందీ మాధ్యమాల్లో పాఠాలు బోధిస్తారు.

ఇదీ చదవండి: ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌.. టీచర్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదిన విద్యార్థులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top