కవిత దీక్ష విజయవంతం

Kavita Diksha is successful - Sakshi

సుమారు 5 వేల మంది హాజరు 

యూపీ, ఢిల్లీ, పంజాబ్‌ నుంచే ఎక్కువమంది 

18 పార్టీల సంఘీభావం 

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలంటూ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష విజయవంతం అయింది. శుక్రవారం జంతర్‌మంతర్‌లో చేపట్టిన ఈ దీక్ష కు తెలంగాణతోపాటు ఢిల్లీ, దాని పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. భారత్‌ జాగృతి చెప్పినట్లుగానే సుమారు 5 వేల మంది ఈ దీక్షలో పాల్గొన్నారు.

తెలంగాణ నుంచి వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు, కవిత అనుచరు లు కలిపి ఐదారువందల మంది రాష్ట్రనేతలు హాజరుకాగా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు దీక్షకు తరలివచ్చారు. ఢిల్లీలోని జేఎన్‌యూ, జామి యా యూనివర్సిటీలతో పాటు చుట్టుపక్కల  వర్సిటీల నుంచి వచ్చిన యువతులు ఆరంభం నుంచి ముగింపు వరకు దీక్షలో పాల్గొన్నారు.  

18 పార్టీల నేతలు, ప్రతినిధులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ఆరంభించగా, సీపీఐ నేత నారాయణ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. సంజయ్‌ సింగ్, చిత్ర సర్వార (ఆప్‌), నరేష్‌ గుజ్రాల్‌ (అకాలీదళ్‌), అంజుమ్‌ జావెద్‌ మిర్జా (పీడీపీ), షమీ ఫిర్దౌజ్‌ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), సుస్మితా దేవ్‌ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్‌ (ఎన్‌సీపీ), పూజ శుక్లా (ఎస్‌పీ), శ్యామ్‌ రజక్‌ (ఆర్జేడీ)తోపాటు శివసేన నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

భారత్‌ కిసాన్‌ యూనియన్, నేషనల్‌ క్రిస్టియన్‌ బోర్డు, తమిళనాడు, కేరళ రైతు సంఘాల ప్రతినిధులు, సింగరేణి కోల్‌ మైన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాలుపంచుకున్నారు.  

కేంద్ర ఇంటెలిజెన్స్‌ నిఘా 
కవిత చేపట్టిన దీక్షపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా పెట్టాయి. దీక్షకు హాజరైన రాష్ట్ర నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత వివరాలన్నింటినీ సేకరించాయి.

సివిల్‌ దుస్తుల్లో ఉన్న సుమారు 20 మందికి పైగా ఇంటెలిజెన్స్‌ అధికారులు దీక్ష జరిగినంత సేపూ అక్కడే ఉండి ప్రతి విషయాన్ని నోట్‌ చేసుకున్నారు. వేర్వేరు భాషల్లో మాట్లాడిన నేతల ప్రసంగాలను అక్కడే మీడియా ప్రతినిధులు, ఇతరులతో తర్జుమా చేయించుకోవడం కనిపించింది. కవిత శనివారం ఈడీ ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల వైఫల్యం చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే ఇంటెలిజెన్స్‌ కన్నేసినట్లు చెబుతున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top