
సాక్షి, రాయచూరు: ప్రేమించిన పాపానికి అమ్మాయిని ఆరు నెలల క్రితం హత్య చేసి పాతిపెట్టాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన కారణంగానే హత్య చేసినట్టు ప్రియుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గదగ్ తాలూకా నారాయణపుర గ్రామంలో మధుశ్రీ (21) అనే యువతిని సతీష్ హిరేమఠ (22) అనే యువకుడు ప్రేమించాడు. ప్రేమ పేరుతో షికార్లకు తీసుకెళ్లాడు. ఐదేళ్ల నుంచి ఈ ప్రేమాయణం సాగుతోంది. ఇది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు హిరేమఠతో తిరగడం మానుకోవాలని ఆమెను హెచ్చరించి గదగ్‌లోని బంధువుల ఇంట్లో ఉంచారు. గత ఏడాది డిసెంబర్ 16న గదగ్ నుంచి మధుశ్రీ వెళ్లిపోయింది. ఈ ఏడాది జనవరి 12న బెటగేరి పోలీస్ స్టేషన్‌లో కనబడుట లేదనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సతీష్ హిరేమఠ్‌పై అనుమానంతో పోలీసుల విచారణ జరిపారు.
పెళ్లి చేసుకోమనడంతో..
ఇద్దరూ బైక్‌లో వెళ్తున్నట్లు గదగ్‌లో కొన్ని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టిగా విచారించగా నిందితుడు నిజం కక్కాడు. పెళ్లి చేసుకోవాలని మధుశ్రీ ఒత్తిడి చేసింది.. తనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఊరి బయటకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి, వాగులో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపాడు. అనంతరం, గదగ్ యస్‌ఐ మారుతి, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా యువతి అస్తిపంజరం కనిపించింది. ప్రేమోన్మాది చేతిలో బలయ్యావా తల్లీ అని తల్లిదండ్రులు విలపించారు.