హిజాబ్‌ వివాదం.. కర్నాటకలో విద్యార్థినిలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Karnataka Police FIR Registered On Students Against Hijab Ban - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్నాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం దేశంలో సంచలనంగా మారింది. ఈ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. కర్నాటకలోని విద్యాసంస్థల వద్ద హిజాబ్‌ను తీసివేసి లోపలికి వెళ్లాలని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో వారి నిర్ణయంపై విద్యార్థినిలు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో నిరసన తెలిపిన వారిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

వివరాల ప్రకారం.. కర్నాటకలో తుమకూరులోని ఎంప్రెస్ కాలేజీలో హిజాబ్‌ ధరించడంపై ఆంక్షలు విధించారు. అయితే, విద్యార్థినిలు మాత్రం హిజాబ్‌ ధరించి కాలేజీకి వచ్చారు. ఈ క్రమంలో కాలేజీలోకి వారిని అనుమతించలేదు యాజమాన్యం. ఈ సందర్బంగా కాలేజీ యాజమాన్యం, విద్యార్థినిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విద్యార్థినిలు తాము హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ కాలేజీ ఆవరణలో ఆందోళనకు దిగారు.

దీంతో, కాలేజీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 10 మంది విద్యార్థినిలపై కాలేజీ ప్రిన్సిప‌ల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు కూర్గ్‌ జిల్లాలోని జూనియర్‌ కాలేజీలో విద్యార్థులు హిజాబ్‌ ధరించి రావడంతో కళాశాల ప్రిన్సిపాల్‌ కాలేజీ ప్రాంగణం నుంచి వారు వెళ్లిపోవాలని అరుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top