బెంగళూరు: రాష్ట్రంలో మందుబాబుకు ఎక్సైజ్ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మే 11 నుంచి కొత్త ఆల్కహాల్ ఇన్ బేవరేజస్(ఏఐబీ) విధానాన్ని అమలు చేసింది. దీంతో ప్రీమియం బీర్, విదేశీ స్కాచ్ విస్కీ ధరలు గణనీయంగా తగ్గాయి. కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం 5 శాతం ఆల్కహాల్ కలిగిన సాధారణ, లాగర్ బీర్ల ధరలను 20 నుంచి 25 శాతం తగ్గించింది.
కింగ్‌ఫిషర్ ప్రీమియం, ఆల్ట్రా 650 మిలీబాటిల్స్ వంటి పేరొందిన బ్రాండ్ల ధరను రూ.75 మేర తగ్గించారు. హైనెకెన్ బీర్ ధర రూ.70, యూబీ ఎక్స్‌పోర్ట్స్ ధర రూ.25, బడ్‌వైసర్ ప్రీమియం ధర రూ.20 మేర తగ్గించారు. బీర్ మాత్రమే కాకుండా విదేశీ ప్రీమియం స్కాచ్ విస్కీ ధరను సైతం 20 శాతం తగ్గించారు. బ్లాక్ లేబల్, చివాస్ రీగల్ లాంటి ప్రజాదరణ పొందిన బ్రాండ్ల 750 మిల్లీబాటిల్ ధర రూ.5,190 నుంచి రూ.4,100కు తగ్గింది.
ఇది ప్రీమియం మద్యంప్రియులకు వరంగా మారింది. సాధారణ ప్రజలు తాగే తక్కువ ధర మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం కొత్త పన్ను విధాన పద్ధతితో తక్కువ ధర కలిగిన మద్యంపై భారీ భారం మోపింది. దీంతో సాధారణ ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఏఐబీ విధానం దేశంలో మొదటి ప్రయోగం. మద్యంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్ను విధించే వ్యవస్థను రూపొందించారు. గతంలో ఉన్న 16 స్లాబ్‌ల విధానాన్ని ప్రస్తుతం 8కి తగ్గించారు. సుమారు 6 దశాబ్దాల పాత పన్ను వ్యవస్థను రద్దు చేసి కొత్త విధానంలో పన్ను వ్యవస్థను అమల్లోకి తెచ్చారు.


