హిజాబ్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన కర్ణాటక హైకోర్టు

Karnataka High Court Full Bench Reserves Judgment After 11 Days Hearing - Sakshi

సాక్షి, బెంగళూరు: హిజాబ్‌ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టులో నమోదైన పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. విద్యాసంస్థల్లో నిర్దేశిత యూనిఫాం మాత్రమే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గత 11 రోజులుగా విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్తీ, న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ ఎస్‌.దీక్షిత్, జస్టిస్‌ జేఎం ఖాజీ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న విచారణ ప్రారంభించి శుక్రవారం పూర్తి చేసింది.

తుది తీర్పును వాయిదా(రిజర్వ్‌) వేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాది రవివర్మ కుమార్‌ వాదనలు వినిపించారు. హిజాబ్‌ను నిరాకరించేందుకు కాలేజీ అభివృద్ధి మండలికి(సీడీసీ) ఎలాంటి అధికారం లేదని అన్నారు. ప్రభుత్వం తన అధికారాలను సీడీసీకి అప్పగించడం సబబు కాదని తెలిపారు. వందల ఏళ్లుగా హిజాబ్‌ ధారణ కొనసాగుతోందని ఇతర పిటిషనర్ల తరపు న్యాయవాదులు గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను పూర్తి చేసి, తుది తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇకపై ఏ న్యాయవాది అయినా అవసరమైతే లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top