వాటర్ బాటిల్ వంద రూపాయలా?
కాఫీ ఏడు వందలా?
ధరలు ఇంతింత ఉంటే భవిష్యత్‌లో మల్టీప్లెక్స్‌లకు ఎవరూ రారు
అధిక ధరలపై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: సినిమా చూసేటప్పుడు అందులోని సీన్స్ చూసి అబ్బో అనాల్సిన ప్రేక్షకులు కౌంటర్ వద్దే టికెట్ ధర చూసి అబ్బో అంటున్న వైనంపై సర్వోన్నత న్యాయస్థానం సైతం విస్మయం వ్యక్తంచేసింది. సినిమా టికెట్ మాత్రమే కాదు విరామ సమయాల్లో విక్రయించే వాటర్ బాటిల్, కాఫీల ధరలు మండిపోతుండంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది.
సహేతుకమైన ధరలు ఉంటేనే ప్రేక్షకులు మల్లీప్లెక్స్‌ల దాకా వస్తారని, లేదంటే హాల్స్ ఖాళీగా మారిపోతాయని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం హెచ్చరించింది. ‘‘మల్టీప్లెక్స్‌లలో సినిమా చూడాలనే ధోరణి తగ్గుతున్న తరుణమిది. ఈ సమయంలో సినిమా టికెట్లు, విరామ సమయాల్లో తినుబండారాల, పానీయాలను అందుబాటు ధరల్లో ఉంచి జనం హాళ్లకు వచ్చేలా చూసుకోండి. లేదంటే హాళ్లు ఖాళీగా మారడం ఖాయం.
సినిమా టికెట్ ధర రూ.200 దాటకుండా చూసుకోండంటూ కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో మేం కూడా ఏకీభవిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సినిమా టికెట్ ధర రూ.200 మించకూడదని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గతంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం తెల్సిందే.
అయితే ఏకసభ్య ధర్మాసనం మల్టీప్లెక్స్ సంఘానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. తర్వాత ఈ కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ చెంతకు రాగా రూ.200 పరిమితి నిబంధన అమలుపై తాత్కాలిక స్టే విధించింది. కానీ మల్టీప్లెక్స్‌లకు కఠిన నిబంధనలను వర్తింపజేసింది. విక్రయించే ప్రతి టికెట్ వివరాలు నమోదుచేయాలని, ఆడిటింగ్ తప్పనిసని అని సూచించింది. దీనిపై మల్టీప్లెక్స్ సంఘం చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
లాయర్, జడ్జి మధ్య వాదోపవాదనలు
ఈ కేసులో మల్టీప్లెక్స్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ, జస్టిస్ విక్రమ్‌నాథ్ మధ్య వాదోపవాదనలు జరిగాయి. ‘‘వాటర్ బాటిల్‌కు రూ.100 ఏంటి? కాఫీకి రూ.700 వసూలుచేస్తారా?’’ అని జడ్జి అన్నారు. దీనిపై లాయర్ రోహత్గీ అడ్డుతగిలారు. ‘‘ తాజ్ హోటల్‌లో కాఫీకి రూ.1,000 వసూలు చేస్తున్నారు. దీనిపై మీరు పరిమితి విధించారా? ఇది అతిథ్యం, సౌకర్యానికి సంబంధించిన విషయం’’ అని అన్నారు. దీనిపై జడ్జి స్పందించారు. ‘‘ ఇలాగే అధిక ధరలుంటే మల్టీప్లెక్స్‌లకు ఎవరూ రారు’’అని అన్నారు. దీంతో న్యాయవాది ‘‘ ఖాళీగా ఉండే ఉండనివ్వండి. మల్టీప్లెక్స్‌లకు రాకుంటే నష్టమేమీ లేదు. ఈ తరహా ధరలు మల్టీప్లెక్స్‌లోనే ఉంటాయి. రేటు ఎక్కువ అనుకునే వాళ్లు సాధారణ థియేటర్‌కు వెళ్తారు’’ అని అన్నారు. దీంతో జడ్జి ‘అసలు ఇప్పుడు అలాంటి థియేటర్లు పెద్దగా లేవు కదా’’ అని అన్నారు. ఈ అంశంపై తదుపరి వాదనలను న్యాయస్థానం నవంబర్ 25వ తేదీకి వాయిదావేసింది.


