
టీవీ నటి శ్రుతి భర్త వెల్లడి
యశవంతపుర: భర్త అనే గౌరవంలేదు. పార్టీ, పబ్ అంటూ తిరగటం, తన విలాసవంతమైన జీవనం కోసం ఆరాటం, అందుకే హత్యాయత్నం చేశానని కన్నడ బుల్లితెర నటి మంజుళ శ్రుతి (38) భర్త అమరేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇటీవల బెంగళూరు హనుమంతనగర పోలీసుస్టేషన్ పరిధిలోని మునేశ్వర బ్లాక్‌లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫిర్యాదు మేరకు భర్త అమరేశ్‌ను అరెస్టు చేశారు. ఇందుకు భార్య ధోరణే కారణమని చెప్పాడు.
ఆమెకు ఏమాత్రం మానవత్వం లేదు, పిల్లలను ఇంటిలో పెట్టి పబ్, పార్టీలంటూ తిరుగుతుంది. అర్ధరాత్రి ఇంటికొచ్చేది. ఒక్కోసారి ఇళ్లు వదిలితే 15 రోజులైనా కనబడదు. కుంభమేళా అంటూ 15 రోజులు అడ్రస్ లేదు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలేజీకీ వెళ్లే ఇద్దరు కూతుళ్లు ఉండగా, నేను రూ.25 లక్షలతో ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాటును కొనాలనుకున్నా. కానీ ఆ డబ్బు తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేసుకొంది. విపరీతంగా వేధిస్తూ ఉండడంతో కత్తితో దాడి చేశాను అని విచారణలో తెలిపాడు. కాగా బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.