న్యాయ సంస్కరణల కమిషన్ ఏర్పాటు చేయాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న వెల్లడి
బెంగళూరు: దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న చెప్పారు. కేసుల కొండ కరగాలంటే న్యాయ సంస్కరణల కమిషన్ (జేఆర్‌సీ) ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవస్థాగతపరమైన కొన్ని లోపాలు కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో జాప్యానికి కారణమవుతున్నాయని అభిప్రాయ పడ్డారు.
శనివారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో ‘పెండింగ్ నుండి సత్వర న్యాయం వరకు: భార తీయ న్యాయస్థానాల్లో న్యాయ పంపిణీపై పునరాలోచన’ అనే అంశంపై జస్టిస్ నాగరత్న మాట్లాడారు. న్యాయ సంస్కరణల కమిషన్‌లో కేవలం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులకే కాకుండా జిల్లా కోర్టుల న్యాయమూర్తులు, న్యాయ వాదులకు సభ్యత్వం కల్పించాలని సూచించారు. జాతీయ స్థాయి బార్ అసోసియేషన్ సభ్యులకు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌కు, ప్రభుత్వ ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం ఉండాలన్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేసే బాధ్యతను ఈ కమిషన్‌కు కట్టబెట్టాలని జస్టిస్ నాగరత్న సూచించారు.
వాయిదాలకే ప్రాధాన్యం
కేసులో యథాతథ స్థితిని విధించడం, విచారణను సుదీర్ఘకాలం వాయిదా వేయడం వంటి కారణాలతో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ‘స్టేటస్ కో’తో ప్రయోజనం పొందే కక్షిదారులు కేసు విచారణ వాయిదాపడడానికి మొగ్గు చూపుతున్నారని చెప్పారు. లాయర్లు వాయిదాలను ఇష్టపడుతున్నారని, దానివల్ల వారికి లాభం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రతిసారి విచారణ జరిగినప్పుడల్లా వారికి ఎంతోకొంత ఆదాయం వస్తోందన్నారు. ప్రభుత్వ విభాగాలు ఏదైనా కేసులో ప్రతికూలంగా తీర్పు వస్తే మళ్లీ అప్పీల్‌కు వెళ్తున్నాయని గుర్తుచేశారు.
చివరకు కేసులు ఎటూ తేలకుండా పెండింగ్‌లో కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు సత్వర తీర్పు కంటే కేసుల వాయిదాకే ప్రాధాన్యం ఇస్తున్నారని జస్టిస్ నాగరత్నం వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే న్యాయ సంస్కరణల కమిషన్ ద్వారా సంస్థాగతమైన మార్పులు తీసుకురావాలని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే అతిపెద్ద కక్షిదారుగా మారుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారులు సూక్ష్మపరిశీనలను తప్పించుకోవడానికి అప్పీళ్లు దాఖలు చేస్తూ కాలం గడిపేస్తున్నారని తెలిపారు. దీనివల్ల త్వరగా పరిష్కారమయ్యే వివాదాలు ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొన్నారు. లాయర్లు వృత్తిపరమైన, నైతిక ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జస్టిస్ నాగరత్న పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆచరణీయమైన లిటిగేషన్ పాలసీ తీసుకురావాలన్నారు. నిధులు సకాలంలో ఇవ్వాలని, న్యాయమూర్తుల పోస్టులు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని వెల్లడించారు.


