IRCTC scam: తేజస్వీ యాదవ్‌ బెయిల్‌ రద్దు చేయండి: సీబీఐ

IRCTC scam: CBI moves bail cancellation against Tejashwi Yadav - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసులో బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసింది. ‘తేజస్వీ యాదవ్‌ సాదాసీదా వ్యక్తి కాదు. బాగా పలుకుబడి కలిగిన వాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులను దూషిస్తూ, బెదిరిస్తూ బహిరంగ హెచ్చరికలు చేశారు. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు’ అని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది.

కోర్టులను కూడా తక్కువ చేస్తూ ఆయన మీడియా సమావేశాల్లో మాట్లాడారని తెలిపింది. దీనిపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్‌ శనివారం తేజస్వీ యాదవ్‌కు నోటీసు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో ఆదేశించారు. రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టును ఒక ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలపై నమోదైన కేసులో యాదవ్‌కు 2018 అక్టోబర్‌లో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top