దివాలా ప్రొసీడింగ్స్‌ : వారికి ఊరట

 Insolvency code suspension can be extended to March 31 :FM Sitharaman - Sakshi

దివాలా ప్రొసీడింగ్స్‌కు మార్చి దాకా బ్రేక్‌

సాక్షి, న్యూఢిల్లీ: దివాలా చట్టం కింద కొత్త ప్రొసీడింగ్స్‌ నిలిపివేతను మరో మూడు నెలల పాటు (మార్చి దాకా) పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ దెబ్బతో కుదేలైన కార్పొరేట్‌ రుణ గ్రహీత సంస్థలకు ఇది ఊరట కల్గించనుంది. కరోనా కష్టకాలంలో వ్యాపార సంస్థలు, పన్నుల చెల్లింపుదారులకు తోడ్పాటునిచ్చేందుకు పన్ను చెల్లింపు తేదీలను పొడిగించడంతో పాటు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని బెంగళూరు చాంబర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌ (బీసీఐసీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ‘దివాలా చట్టం కింద చర్యల నిలిపివేతను డిసెంబర్‌ 25 తర్వాత వచ్చే ఏడాది మార్చి 31దాకా పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి‘ అని మంత్రి చెప్పారు. దీంతో మొత్తం ఏడాది పొడవునా దివాలా చట్టం అమలు పక్కన పెట్టినట్లవుతుందని తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రతి పరిశ్రమ తీవ్ర ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో ఏ ఒక్కరూ సమస్యలు ఎదుర్కొనకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన మార్చి 25 నాటి నుంచి దివాలా చట్టం కింద కొత్తగా ప్రొసీడింగ్స్‌ చేపట్టకుండా ఆర్డినెన్స్‌ ద్వారా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top