దేశాన్ని కుదిపేసిన రియల్‌ క్రైమ్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

Indrani Mukerjea Series On Netflix What Happened To Sheena Bora - Sakshi

అది దేశ వాణిజ్య నగరం ముంబై. 2012లో బయటపడ్డ ఓ నేరం.. దేశం మొత్తాన్ని ఆకర్షించింది. దాదాపు పదేళ్లకు పైనే దాని గురించి మాట్లాడుకునేలా చేసింది. తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని సొంత బిడ్డను  ఓ కన్నతల్లే పొట్టనబెట్టుకున్న కేసది. సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఈ వాస్తవ గాథ.. ఇప్పుడు డాక్యు-సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ముంబై మెట్రో వన్‌ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున​ షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్‌ దర్యాప్తు మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రాణీ ముఖర్జీకి మీడియా ఎగ్జిక్యూటివ్‌గా సొసైటీలో మంచి పేరుంది. షీనా అంటే ప్రాణం అన్నట్లుగా ఇంద్రాణి ఉండేది. అలాంటిది పోలీసులు ఆమె వైపు మళ్లుతారని ఎవరూ ఊహించి ఉండరు. అప్పటికే అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నాడనే అభియోగాలతో ఆమె డ్రైవర్‌ శ్యామ్‌వర్‌ రాయ్‌ అరెస్ట్‌ అయ్యాడు. అతనిచ్చిన సమాచారమే.. మొత్తం కేసునే మలుపు తిప్పింది. 

ఇంద్రాణీ ముఖర్జీ.. మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్‌ జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్‌ అయిన పీటర్‌ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది.

అప్పటికే వయసుకొచ్చిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. అప్పటికే వ్యాపారంలోనూ ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు నష్టాలు చవిచూస్తూ ఉంది. ఆ సమయంలోనే షీనా తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. అందుకు రెండో భర్త సంజీవ్‌ ఖన్నా సహకారం కోరింది.

రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్‌ఖన్నా సూచించాడట. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్‌ ముఖర్జియా, కొడుకు రాహుల్‌ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్‌కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్‌ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. 

దీంతో పీటర్‌ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్‌కు సూచించింది. సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్‌ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి..  కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్‌ శ్యాంరాయ్‌ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు.

♦1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్‌’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలతో పాటు కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులైంది.

కన్న కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్‌ డైరీ ఆధారంగా.. 

షీనా బోరా హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్‌డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు.  23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్‌ తయారు చేశారు.

అది.. ఏప్రిల్‌ 23, 2012.. 
ఉదయం 9గంటలు:
 డ్రైవర్‌ శ్యాంరాయ్‌తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. 

ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. 

ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్‌టాప్‌ హోటల్‌లో సంజీవ్‌ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్‌ బుక్‌ చేసింది.

అది.. ఏప్రిల్‌ 24,  2012.. 

మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్‌ ఖన్నా కోల్‌కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్‌టాప్‌ హోటల్‌ చేరుకున్నాడు. 

మద్యాహ్నం 1.53నిమిషాలకు:  ఇంద్రాణికి కాల్‌చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్‌ఖన్నా

మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసి రూమ్‌లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి.

మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్‌ఖన్నాకు కాల్‌చేసి... హత్యకు సంబంధించి ప్లాన్‌పై డిస్కస్‌ చేసింది ఇంద్రాణి. 

సాయంత్రం 6గంటలకు: హిల్‌టాప్‌ హోటల్‌ నుంచి సంజీవ్‌ఖన్నాను హిల్‌టాప్‌ హోటల్‌ నుంచి పికప్‌ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్‌ శ్యాంమనోహర్‌ కారు డ్రైవ్‌ చేస్తున్నారు. 

సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్‌ రోడ్‌ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. 

సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్‌ రోడ్‌లోని నేషనల్‌ కాలేజ్‌ సమీపంలో తన కోసం వెయిట్‌ చేస్తున్న ఓపెల్‌ కోర్సా కారులో కూర్చుంది షీనా.

సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్‌ శ్యాం మనోహర్.. నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. 

రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో...  కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఇంద్రాణి  ఆదేశించింది. అయితే

అప్పటికే షీనాబోరాకు  ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్‌కు తెలియదు. దీంతో తాను టాయిలెట్‌కు వెళతానని చెప్పి డ్రైవర్‌ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్‌ వెళ్లగానే  ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్‌ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్‌కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది.  అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్‌ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్‌లు నిర్ణయించుకున్నారు. రాయ్‌గఢ్‌ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్‌ అన్నాడు. 

రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్‌ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. 

రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్‌ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. 

రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. 

అది.. ఏప్రిల్ 25,  2012

అర్థరాత్రి 12.19నిమిషాలకు:  సంజీవ్‌ఖన్నా తన హిల్‌టాప్‌ హోటల్‌కు బయలేదేరాడు

అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు కాల్‌చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. 

అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్‌ శ్యాం రాయ్‌కు ఫోన్‌చేసింది ఇంద్రాణి.

అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్‌ శ్యాంరాయ్‌కు ఫోన్‌ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. 

అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్‌తో కలిసి హిల్‌టాప్‌ హోటల్‌కు బయలుదేరి వెళ్లింది. 

అర్ధరాత్రి  02.47 నిమిషాలకు: రాయ్‌గఢ్‌లోని  గగోడే బుద్రుక్‌ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నా, డ్రైవర్‌ శ్యాంరాయ్‌.

తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్‌ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. 

తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్‌ఖన్న, శ్యాంరాయ్‌లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. 

ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. 

ఉదయం 07.33నిమిషాలకు:  ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. 

ట్విస్టుల పర్వం సాగిందిలా.. 

April 24, 2012: షీనా బోరా ఉద్యోగానికి సెలవు పెట్టింది. ఆమె ఉద్యోగానికే రాజీనామా చేసిందని ఒకవైపు మీడియా..  ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిందని కుటుంబం ప్రకటించింది. అప్పటికి మిస్సింగ్‌ కేసు నమోదు కాలేదు. 

May 23, 2012: నెలరోజుల తర్వాత.. మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లో షీనా బోరా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.. ఆపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు మొదలైంది.

August 2015: మూడేళ్ల తర్వాత.. కూతురిని చంపిందనే అభియోగాలపై ఇంద్రాణి ముఖర్జీ అరెస్ట్‌ అయ్యింది. ఆ మరుసటిరోజే కోల్‌కతాలో ఆమె మాజీ భర్త సంజీవ్‌ ఖన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

August 2015: ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ కూడా అరెస్ట్‌ అయ్యాడు.  ఈ ముగ్గురు నిందితుల్ని క్రైమ్‌ సీన్‌ రీక్రియేన్‌ చేశారు. దర్యాప్తులో డ్రైవర్‌ శ్యామ్‌ షీనాను హత్య చేసి.. మృతదేహాన్ని పడేశామని ఒప్పుకున్నాడు. ఇంద్రాణితో పాటు సంజీవ్‌ ఖన్నా కూడా ఇందులో భాగం అయ్యారని చెప్పాడు. 

September 2015: షీనా బోరా కేసులో ఇది ఊహించని మలుపు. షీనా బోరా అసలు తండ్రిని తానేనంటూ కోల్‌కతాకు చెందిన సిద్ధార్థ దాస్‌ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత.. కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ముగ్గురు నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 

November 2015: షీనా బోరా హత్య కేసులో.. ఇంద్రాణి భర్త పీటర్‌ ముఖర్జియాను సైతం సీబీఐ అరెస్ట్‌ చేసింది.

2016: ఇంద్రాణి ముఖర్జీ, ఆమె డ్రైవర్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.  ఆ తర్వాత పీటర్‌ పేరును కూడా చేర్చారు. రాహుల్‌తో రిలేషన్‌షిప్‌ కారణంగానే.. ఇంద్రాణీ ఈ ఘాతుకానికి పాల్పడిందని సీబీఐ అందులో పేర్కొంది. 

January-February 2017: కోర్టు విచారణ ప్రారంభం. షీనా బోరాను చంపేందుకు కుట్ర..  ఎత్తుకెళ్లి చంపడం.. ఆధారాలను నాశనం చేసే కుట్ర.. తప్పుడు సమాచారం ఇవ్వడం.. లాంటి అభియోగాలపై వాదప్రతివాదనలు మొదలయ్యాయి.

October 2019: ఇంద్రాణి, పీటర్‌ ముఖర్జియాలకు విడాకులు మంజూరు చేసిన ముంబై ఫ్యామిలీ కోర్టు

March 2020: పీటర్‌ ముఖర్జియాకు బెయిల్‌

July 2021: బెయిల్‌ కోరుతూ నాలుగు పిటిషన్‌లు దాఖలు చేస్తే.. అన్నింటిని సీబీఐ స్పెషల్‌ కోర్టు తిరస్కరించింది

August 2021: షీనా బోరా హత్య కేసు దర్యాప్తును ముగించినట్లు ప్రకటించుకున్న సీబీఐ

February 10, 2022: సుప్రీం కోర్టుకు చేరిన ఇంద్రాణి ముఖర్జీ బెయిల్‌ అభ్యర్థన

February 18, 2022: సీబీఐతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరుతూ సుప్రీం నోటీసులు

March 25, 2022: ఇంద్రాణి ముఖర్జీ బెయిల్‌ను తిరస్కరించాలని సీబీఐ వాదన

May 18, 2022: ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్లు జైల్లో గడపడంతో సుప్రీం బెయిల్‌ ఇచ్చేందుకు అభ్యంతరాలు చెప్పలేదు.. మంజూరు చేసింది.

కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటూ ఆరేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఇంద్రాణి(50)కి 2022లో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్‌ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని ఈ సందర్భంగా కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్‌ ఇవ్వడమే సబబుగా భావించింది. సుప్రీం ఊరట ఇచ్చాక.. ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందామెకు. దీంతో.. మే 20, 2022 శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్‌ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది.. జైలు నుంచి బయటకు వచ్చాక ఇంద్రాణి చెప్పిన తొలి మాట. 

‘ఒక కుటుంబంలోని చీకటి రహస్యం..యావత్‌ దేశాన్ని కుదిపేసిన సంచలన కుంభకోణం’ .. ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్..  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ సందర్భంగా.. 

మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ భావించింది. అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ  సీబీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన డివిజన్‌ బెంచ్‌.. దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. దీనికి నెట్‌ఫ్లిక్స్‌ అంగీకరించింది. విచారణ పూర్తయ్యేవరకు ప్రసారం చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో దీని విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top