దేశంలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం

India Reports First Bird Flu Death AIIMS Delhi Staff Placed Under Isolation - Sakshi

హరియాణాలో బర్డ్‌ ఫ్లూతో 11 ఏళ్ల బాలుడు మృతి

చండీగఢ్‌: దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్‌ ఫ్లూ(ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదయ్యింది. హరియాణాలో 11 ఏళ్ల బాలుడు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా వైరస్‌తో బాధపడుతూ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బర్డ్‌ ఫ్లూతో మృతి చెందిన తొలి కేసు ఇదేనన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిమ్స్‌ సిబ్బంది అందరు ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులకు బర్డ్‌ ఫ్లూ సోకడం అనేది చాలా రేర్‌గా జరుగుతుందని.. కానీ ఒక్కసారి దాని బారిన పడితే మరణాల రేటు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. బర్డ్‌ ఫ్లూ సోకిన వారిలో మరణాల రేటు 60శాతంగా ఉంటుందని తెలిపింది. 

ఈ ఏడాది ప్రారంభంలో హరియాణాతో సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల బర్డ్‌ ఫ్లూ వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇక హరియాణాలో నిపుణులు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా వైరస్‌ సబ్‌ టైప్‌ హెచ్‌5ఎన్‌8(H5N8)ని గుర్తించారు. ఈ జాతి మనుషులకు సోకుతుందని తెలిపారు. ఢిల్లీ, కేరళ, రాజస్తాన్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ మహారాష్ట్రల్లో బర్డ్‌ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో బర్డ్‌ ఫ్లూ సంక్రమణ వ్యాప్తిని ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా పక్షులను చంపడం జరిగింది. 

జనవరిలో ఢిల్లీ ఎర్రకోట నుంచి సేకరించిన పక్షుల నమూనాలు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఖాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది. ఫిబ్రవరిలో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ నుంచి సేకరించిన మరిన్ని నమూనాల్లో బర్డ్‌ ఫ్లూ పాజిటివ్‌గా తేలాయి. 

మార్చిలో ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా తిరిగి కనిపించింది. మహారాష్ట్రలోని అమరావతి, నందూర్బార్ జిల్లాల్లో 261 పౌల్ట్రీ పక్షులు చనిపోయాయి. ఏప్రిల్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని పాంగ్ డ్యామ్ సరస్సులో 100 వలస పక్షులు చనిపోవడంతో బర్డ్‌ ఫ్లూ సంక్రమణ భయం మళ్లీ పెరిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top