Pegasus: పెగాసస్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన నివేదిక.. మరోసారి దుమారం

India Bought Pegasus As Part Of Defence Deal With Israel In 2017: Report - Sakshi

న్యూఢిల్లీ: గతేడాది దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతోపాటు పెగాసస్ స్పైవేర్ భాగమేనని నివేదిక పేర్కొంది. పెగాసస్ వ్యవహారంపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కాగా  ఎన్‌ఎస్ఓ సంస్థకు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో భారత్ సహా పలు దేశాల్లో జర్నలిస్ట్‌లు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసినట్టు బయటకు రావడంతో వివాదం చెలరేగింది.
చదవండి: నామినేషన్ దాఖలు చేసిన ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్

తాజాగా ‘‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైబర్‌వెపన్ కోసం యుద్ధం’’ పేరుతో న్యూయార్క్ టైమ్స్  ప్రచురించిన ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఎస్ఓ తన సాఫ్ట్‌వేర్‌ను పలు నిఘా సంస్థలు, చట్టాలను అమలుచేసే సంస్థలకు దశాబ్దం కాలం నుంచి విక్రయిస్తోందని తెలిపింది. తమ సాఫ్ట్‌వేర్‌కు సాటి మరేదీ లేదని, ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లను స్థిరంగా, విశ్వసనీయంగా ట్రాక్ చేయగలదని వాగ్దానం చేసిందని పేర్కొంది. జులై 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఇజ్రాయేల్ పర్యటన  వెళ్లగా.. దీని గురించి కూడా నివేదిక ప్రస్తావించింది.
చదవండి: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు 

పర్యటన సమయంలో ఇరుదేశాల మధ్య 2 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరిందని, ఈ డీల్‌లోనే పెగాసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అనంతరం బెంజిమిన్ నెతన్యాహు భారత్‌లో పర్యటించారని, జూన్ 2019లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో ఇజ్రాయేల్‌కు మద్దతుగా పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు పరిశీలకుల హోదాను నిరాకరించడానికి భారత్ ఓటు వేసిందని నివేదిక పేర్కొంది. అయితే న్యూయార్క్ టైమ్స్ నివేదికపై కేంద్రాన్ని పీటీఐ సంప్రదించగా.. తక్షణమే స్పందించడానికి నిరాకరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top