బంకమట్టి రేణువులతో  కరోనా పరీక్ష | IIT-Guwahati uses clay particles to develop affordable COVID-19 testing method | Sakshi
Sakshi News home page

బంకమట్టి రేణువులతో  కరోనా పరీక్ష

Jun 7 2025 5:50 AM | Updated on Jun 7 2025 5:50 AM

IIT-Guwahati uses clay particles to develop affordable COVID-19 testing method

కొత్త విధానం అభివృద్ధి చేసిన ఐఐటీ–గౌహతి పరిశోధకులు  

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ సోకిందో లేదో గుర్తించడానికి ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)–గౌహతి పరిశోధకులు చౌకైన, తేలికైన విధానాన్ని అభివృద్ధి చేశారు. వైరస్‌ నిర్ధారణకు ఇదొక ప్రత్యామ్నాయం అవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం వారు బంకమట్టి రేణువులు ఉపయోగించారు. కరోనా వైరస్‌ కలిగిన ఉప్పునీటి ద్రావకంలో ఈ రేణువులు వేగంగా మార్పులకు గురవుతున్నట్లు తేల్చారు. 

రేణువుల్లోని క్లే–ఎలక్ట్రోలైట్‌ సిస్టమ్‌ అవక్షేపణ రేటు మారుతున్నట్లు గుర్తించారు. ఈ మార్పులను బట్టి వైరస్‌ సోకిందో లేదో సులభంగా గుర్తుపట్టవచ్చని పేర్కొన్నారు. మార్పులేవీ లేకపోతే వైరస్‌ సోకనట్లే. బాధితుల నుంచి నమూనాలు సేకరించి, ఈ పరీక్ష నిర్వహిస్తే ఫలితంగా త్వరగా తేలిపోతుంది. సార్స్‌–కోవ్‌–2ను గుర్తించడానికి ప్రస్తుతం పాలిమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌(పీసీఆర్‌) టెస్టు చేస్తున్నారు. దీనికి చాలా సమయం పడుతోంది. అంతేకుండా భారీ యంత్ర పరికరాలు అవసరం. యాంటిజెన్‌ టెస్టు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ పరీక్షలో కచ్చితత్వం తక్కువే. 

యాంటీబాడీ టెస్టింగ్‌కు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని ఐఐటీ–గౌహతి ప్రొఫెసర్‌ టి.వి.భరత్‌ చెప్పారు. ప్రయోగశాలలు, నిపుణులు, వనరులు లేనిచోట ఇలాంటి పరీక్షలు చేయలేం కాబట్టి బంకమట్టి రేణువులతో వైరస్‌ను గుర్తించడం చక్కటి ప్రత్యామ్నాయం అవుతుందని పేర్కొన్నారు. దీంతో కచ్చితమైన ఫలితం లభిస్తుందని వెల్లడించారు. ఈ పరీక్ష కోసం పరిశోధకులు బెంటోనైట్‌ అనే బంకమట్టి ఉపయోగించారు. ఇందులో విశిష్టమైన రసాయన నిర్మాణం ఉంటుంది. కాలుష్య కారకాలు, భారీ లోహాలను సైతం సులభంగా పీల్చుకోగలదు. బంకమట్టి రేణువులు వైరస్‌లను గ్రహిస్తాయి. అందుకే వైరస్‌ల ఉనికిని గుర్తించడానికి బంకమట్టి ఉపయోగించే విధానాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement