రైతుల కోసం 'క్రాప్‌ దర్పణ్‌'!

IIIT H Develops App to help Farmers in Crop Disease Diagnosis - Sakshi

హైదరాబాద్: పంటలకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చేందుకు ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ ప్రత్యేక యాప్‌ రూపొందించింది. పత్తి పంటకు సోకే వ్యాధుల నిర్ధారణలో రైతులకు సాయం చేసేందుకు 'క్రాప్ దర్పణ్' పేరిట యాప్‌ తయారు చేశారు. భారత్‌-జపాన్‌ జాయింట్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ ప్రాజెక్టు కింద దీన్ని రూపొందించారు. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐటీ హైదరాబాద్‌, బాంబే ఐఐటీ సహకారంతో ట్రిపుల్‌ ఐటీ ఈ యాప్‌ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.(చదవండి: కాళేశ్వరంలో పడవ ప్రయాణం)

తొలుత పత్తి పంటపై మాత్రమే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. తదుపరి దశల్లో ఇతర పంటలపై కూడా దృష్టి పేట్టి యాప్‌ల రూపకల్పన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రిపుల్‌ ఐటీ-హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ పి.కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అరవింద గాడమశెట్టి, రేవంత్‌ పర్వతనేని, సాయిదీప్‌ చెన్నుపాటి, శ్రీనివాస్‌ అన్నపల్లి కలసి ఈ యాప్‌ రూపొందించారు. గతంలో కూడా వ్యవసాయ సలహా వ్యవస్థను, గ్రామ స్థాయిలో ఈ-సాగును ట్రిపుల్‌ ఐటీ అభివృద్ధి చేసింది. 

చీడపీడలపై రైతులకు అవగాహన
పత్తి పంట పెరుగుదలను ప్రభావితం చేసే సమస్యలు, తెగుళ్లు, బ్యాక్టీరియా, శిలీంద్ర వ్యాధులు, పోషక లోపాలకు సంబందించిన అంశాలు ఈ యాప్‌లో పాందుపర్పారు. చీడపీడలపై రైతులపై మార్గనిర్దేశం చేయడమే కాకుండా అవగాహన కల్పిస్తుంది. https://www.cropdarpan.in/cropdarpan/ పోర్టల్‌లో లింకు ద్వారా ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం పత్తి పంటపై మాత్రమే తెలుగు, ఇంగ్లిష్‌ భాషలలో రూపొందించారు. త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాప్‌లోని ప్రశ్నలను ఎంపిక చేసుకుంటే వాటికి సమాధానాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. విత్తనాలు ఎప్పుడు వేయాలో, పోషకాలు ఎలా అందించాలో ఈ యాప్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top