ఈ కథ ఎంతోమందికి ప్రేరణ.. 6 నెలల పాటు గదిలో బంధించుకుని

IAS Officer Nidhi Siwach Locked Herself in A Room For 6 Months Crack UPSC Exam - Sakshi

కలల కొలువు కోసం ఓ ఐఏఎస్‌ అధికారి వినూత్న ప్రయత్నం

మూడో సారి జాతీయ స్థాయిలో 87వ ర్యాంక్‌

ఉద్యోగార్థులకు ప్రేరణగా నిలుస్తోన్న కథనం

వెబ్‌డెస్క్‌: ప్రభుత్వ ఉద్యోగం అంటే యువతలో చాలా క్రేజ్‌. అందులోనూ ఐఏఎస్‌ అంటే ఇక మరి చెప్పనక్కర్లేదు. వందల్లో ఉండే పోస్టులకు ఏటా లక్షల్లో అప్లై చేస్తుంటారు. కానీ కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు. లక్షల మంది అప్లై చేస్తే.. కొందరిని మాత్రమే విజయం వరిస్తుంది. ఎందుకంటే కలల కొలువు కోసం వారు అహర్నిశలు శ్రమిస్తారు. స్నేహితులు, సరదాలు ఏం ఉండవు. వారి ధ్యాస అంత తమ ధ్యేయం మీదనే ఉంటుంది. 

ఈ క్రమంలో కొలువు సాధించడం కోసం కొందరు అందరికి భిన్నంగా ప్రయత్నిస్తారు. ఈ కోవకు చెందిన వారే హరియాణా గురుగ్రామ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి నిధి సివాచ్‌. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఆమె కథ ప్రేరణగా నిలుస్తుంది. ఆ వివారలు.. గురుగ్రామ్‌కు చెందిన నిధి సివాచ్‌ చదువులో ఎప్పుడు ముందుండేవారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో 95, 90 శాతం మార్కులు సాధించారు. హరియాణ సోనిపాట్‌లోని దీనబంధు ఛోటురామ్‌ యూనివర్శిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 

చదువు పూర్తయిన వెంటనే నిధికి హైదరాబాద్‌ టెక్‌ మహీంద్రాలో డిజైన్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లపాటు జాబ్‌ చేసినప్పటికి ఆమెకు సంతృప్తి లేకపోయింది. ఐఏఎస్‌ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2017లో జాబ్‌కు రాజీనామా చేసి.. యూపీఎస్సీకి చదవడం ప్రారంభించారు.  ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్ష రాయాలని భావించారు నిధి. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా చరిత్రను ఎంచుకున్నారు. తాను తొమ్మిది, పదో తరగతిలో చదివని సిలబస్‌ యూపీఎస్సీ ప్రిపరేషన్‌కు ఎంతో మేలు చేస్తుందని భావించి.. చరిత్రను ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు నిధి. 

మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోయారు నిధి. ఓటమి ఆమెలో మరింత కసిని పెంచింది. ఈసారి తప్పకుండా ఉద్యోగం సాధించాలని బలంగా నిర్ణయించుకున్నారు. దానికోసం నిధి పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. మూడో సారి తన ప్రిపేరషన్‌ పంథాను పూర్తిగా మార్చేశారు నిధి. తనను తాను 6 నెలల పాటు గదిలో బంధించేసుకున్నారు. వేరే దేని మీదకు తన ధ్యాస మళ్లకుండా రూమ్‌కే పరిమితయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెకు కావాల్సిన ఆహారం, ఇతర వస్తువులు అందించేవారు. 

అలా ఆరు నెలల పాటు రూమ్‌కే అంకితం అయ్యి.. శ్రద్ధగా చదివిన నిధిని చూసి ఓటమి పారిపోయింది. ఈసారి ఏకంగా ఆల్‌ ఇండియా లెవల్లో 87వ ర్యాంకు సాధించారు నిధి. ప్రస్తుతం ఆమె గుజరాత్‌లో ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. కోరుకున్న ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top