Keerthi Jalli IAS Officer Success Story: నిజంగానే మట్టిలో మాణిక్యం మన కీర్తి జల్లి

IAS officer Keerthi Jalli  Walked Through Mud In Assams Flood Affected Areas - Sakshi

దిస్‌పూర్‌: సాధారణంగా ఐఏఎస్‌ ఆఫీసర్‌ అంటే ఏమనుకుంటాం..పైనుండి ప్రభుత్వ విధానాల అమలు పరిధిని మాత్రమే చూసుకుంటూ తగిన సూచనలు చేసేవారనే అనుకుంటాం. ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం వీరి సొంతమైనా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ‘మేము సైతం’ అంటూ ప్రజల కష్టాల్లో అడుగులు వేయడానికి కూడా వీరు వెనుకడుగు వేయరు.

అచ్చం అలానే అస్సాంకి చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. అస్సాంలో వరదలు ముంచెత్తుతున్న తరుణంలో మహిళా ఐఏఎస్‌ ఆఫీసర్‌ కీర్తి జల్లి స్వయంగా ఆ మునిగిపోయిన ప్రాంతాలను పర్యవేక్షించారు. చాలా సింపుల్‌గా చీరకట్టులో ఆ ప్రాంతాల్ని పర్యవేక్షించడానికి వచ్చిన ఆమె.. బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరిగిన నష్టాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఒక ఐఏఎస్‌ అధికారిణి మట్టి, బురద, నీరు అనేది చూడకుండా ఆ ప్రాంతాలు కలియదిరడగం విశేషంగా ఆకట్టుకుంది. నిజంగానే ఆమె మట్టిలో మాణిక్యం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఇంతకీ కీర్తి జల్లి ఎవరు?
ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కీర్తి జల్లి పేరు ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు కీర్తి జల్లి ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్న చేస్తున్నారు నెటిజన్లు. కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్‌ జిల్లా. ఆమె తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బి.టెక్‌ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐ.ఏ.ఎస్‌ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్‌ కోసం ఢిల్లీకి వెళ్లింది. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది.

ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు
ఐ.ఏ.ఎస్‌ ట్రయినింగ్‌ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం లభించింది. జోర్‌హట్‌ జిల్లాలోని తితబార్‌ ప్రాంతానికి సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఓటింగ్‌ శాతం పెంచేందకు ఆమె చేసిన కృషికి నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్‌ ఎలక్టొరల్‌ ప్రాక్టిసెస్‌ అవార్డ్‌’ దక్కింది.

ఉసిరి మురబ్బాతో సమస్యకు చెక్‌
2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా కీర్తి బాధ్యతలు నిర్వహించే సమయంలో అక్కడి ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా టీ ఎస్టేట్స్‌లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. పిల్లల్లో పౌష్టికాహారలోపం  విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి.

ఇక అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కీర్తి. అంగన్‌వాడీ కేంద్రాలలో ‘డిబ్బీ ఆదాన్‌ ప్రధాన్‌’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్‌ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్‌ తాము తింటారు. దాని వల్ల ఇతర రకాల ఆహారం తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి కీర్తి తెచ్చి పెట్టింది.

పెళ్లైన మరుసటి రోజే విధుల్లోకి
2020 మే నెల నుంచి కచార్‌ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్‌ నియంత్రణ కోసం పోరాటం చేస్తోంది కీర్తి. సిల్‌చార్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్‌ పేషెంట్స్‌కు సరిపోవడం లేదు కనుక కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్‌ నిర్మాణం జరుగుతోంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి హాజరవడం చూస్తే ఆమె పని స్వభావం అర్థమవుతుంది. కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె విశ్వాసం. అది ఎలాగూ జరుగుతోంది. ప్రజలూ, పత్రికలు ఆమెను మెచ్చుకోకుండా ఎందుకు ఉంటాయి.
చదవండి👉: కన్నీళ్లలో అస్సాం.. మునుపెన్నడూ లేనంతగా డ్యామేజ్‌.. పదేళ్లలో చేసిందంతా నీళ్లపాలు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top