రూ.150 కోట్ల ఇల్లు.. రూ.4 లక్షలకే కొన్నారు.. లాలూ కుటుంబం ఇంట్లో భారీగా అక్రమ నగదు, బంగారం..

Huge Unaccounted Cash Jewellery Found At Lalu Family - Sakshi

న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణానికి సంబంధించి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్ కుటంబసభ్యుల నివాసాల్లో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో అక్రమ నగదు, ఆభరణాలను భారీగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. లాలూ కుటుంబసభ్యుల నివాసాల్లో రూ.కోటి నగదు, విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారు కడ్డీలు, ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు లభించినట్లు వెల్లడించారు.

అలాగే ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తేజస్వీ యాదవ్ బంగళా విలువ ప్రస్తుతం రూ.150 కోట్లని, దీన్ని గతంలో రూ.4లక్షలకే కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నాలుగు అంతస్తుల భవనం ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుపై రిజిస్టర్‌ అయి ఉందని, కానీ తేజస్వీ యాదవ్ దిన్ని నివాసంగా ఉపయోగిస్తున్నారని వెల్లడించింది.

ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు జాబ్ ఫర్ స్కాం ద్వారా వచ్చిన నగదు లేదా రాబడిని  ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన రత్నాలు, ఆభరణాల సంస్థలు అక్రమంగా సంపాదించిన డబ్బును వినియోగించినట్లు పేర్కొన్నారు.

ఈ కుంభకోణం ద్వారా వచ్చిన రాబడి విలువ ప్రస్తుతం రూ.600కోట్లు అని ఈడీ అధికారులు చెప్పారు. వీటిలో రూ.350కోట్లు స్థిరాస్థులు కాగా.. బినామీల ద్వారా రూ.250 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని వివరించారు.
చదవండి: రబ్రీ..లాలూ అయిపోయారు.. ఇప్పుడు తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top