అన్నాడీఎంకే మాజీ నేత‌కు.. టీవీకే ప్ర‌భుత్వంలో కీల‌క ప‌దవి! | How KA Sengottaiyan play crusial role in TVK govt in Tamil Nadu | Sakshi
Sakshi News home page

Sengottaiyan: టీవీకే ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు కీల‌క ప‌దవి!

May 4 2026 8:04 PM | Updated on May 4 2026 8:25 PM

How KA Sengottaiyan play crusial role in TVK govt in Tamil Nadu

కుల్లంపాళయం అర్థనారి సెంగొట్టయన్.. త‌మిళుల‌కు సుప‌రిచిత‌మైన పేరు. కేఏ సెంగొట్టయన్‌గా ప్ర‌సిద్ధులు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. గోబిచెట్టిపాలయం నియోజ‌కవ‌ర్గం నుంచి 9వ సారి విజ‌యం సాధించి చ‌రిత్రకెక్కారు. 1977లో మొద‌టిసారిగా సత్యమంగళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 10 ప‌ర్యాయాలు శాస‌న‌స‌భ్యుడిగా విజ‌యాలు అందుకున్నారు. ఐదు ద‌శాబ్దాల పాటు అన్నాడీఎంకేలో కొన‌సాగిన ఆయ‌న ఈసారి ఎన్నిక‌ల్లో టీవీకే పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ‌య కేత‌నం ఎగర‌వేయ‌డం విశేషం.

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌రైన సెంగొట్టయన్ గ‌తేడాది న‌వంబ‌ర్‌లో హీరో విజ‌య్ నాయ‌క‌త్వంలోని త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీలో చేరారు. విజ‌య్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన మొద‌టి సీనియ‌ర్ నేత ఆయ‌నే కావ‌డం గ‌మ‌నార్హం. టీవీకేలో చేరిన వెంటనే ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌కున్న  అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నత-స్థాయి పరిపాలనా కమిటీకి ముఖ్య సమన్వయకర్తగా నియ‌మించారు. దీంతో పాటుగా పశ్చిమ జిల్లాలైన కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, నీలగిరిలకు ఆర్గనైజేషన్ సెక్రటరీగా కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అన్నాడీఎంకేలో అవ‌మానం
టీవీకే పార్టీలో చేర‌డానికి కొద్ది రోజుల ముందు అన్నాడీఎంకేలో సెంగొట్టయన్ తీవ్ర అవ‌మానాలు ఎదుర్కొన్నారు. అన్నాడీఎంకేని వీడిన మాజీ నాయ‌కుల‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు ఆ పార్టీ అధినేత ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామికి రుచించ‌లేదు. పార్టీని వీడిన, బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన నాయ‌కులు తిరిగి సొంత‌గూటికి రావాల‌ని పిలుపునివ్వ‌డంతో సెంగొట్టయన్‌ను ప‌ళ‌నిస్వామి టార్గెట్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, ఈరోడ్ రూర‌ల్ ప‌శ్చిమ జిల్లా కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి ఆయ‌న‌ను తొల‌గించారు. సెంగొట్టయన్ మ‌ద్ద‌తుదారుల ప‌ద‌వులు కూడా పీకేశారు. డీఎంకే కూట‌మిని ఓడించ‌డానికే తాను మాజీ నేత‌ల‌ను తిరిగి రావాల‌ని కోరిన‌ట్టు వివ‌రించినా ప‌ళ‌నిస్వామి ప‌ట్టించుకోలేదు. అక్క‌డితో ఆగ‌కుండా పార్టీ నుంచి ఆయ‌న‌ను బ‌హిష్క‌రించారు. దీంతో విజ‌య్‌తో ఆయ‌న చేతులు క‌లిపారు.

సరికొత్త చ‌రిత్ర
ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళ‌యం తాలుకాలోని కుల్లంపాళయంలో జ‌న్మించిన 78 ఏళ్ల సెంగొట్టయన్ త‌మిళ రాజ‌కీయాల్లో అంచెలు అంచెలుగా ఎదిగారు. 10వ ప‌ర్యాయం ఎమ్మెల్యేగా గెలిచి స‌త్తా చాటారు. త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌లో అత్య‌ధిక కాలం పాటు స‌భ్యుడిగా కొన‌సాగిన దురై మురుగన్ స‌రస‌న చేరారు. మురుగన్ ఇప్ప‌టికే 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. తాజా ఎన్నిక‌ల్లో త‌న క‌ట‌ప్పాడి నుంచి టీవీకే అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు. 1996 నుంచి ఇక్క‌డ గెలుస్తూ వ‌స్తున్న ఆయ‌న‌కు కొత్త పార్టీ చేతిలో చుక్కెదురైంది. 1984 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 11 సార్లు ఇక్క‌డి నుంచి పోటీ చేయగా మూడు సార్లు మాత్ర‌మే ఆయ‌న ఓటమి చ‌విచూశారు.

చ‌ద‌వండి: త‌మిళ సీఎం ప్ర‌మాణ‌స్వీకారానికి ప్ర‌ధాని మోదీ

సెంగొట్టయన్ త‌న నియోజ‌క‌వ‌ర్గం గోబిచెట్టిపాళ‌యంలో 10 ప‌ర్యాయాలు పోటీ చేయ‌గా ఒక‌సారి మాత్ర‌మే గెల‌వ‌లేక‌పోయారు. ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏకంగా తొమ్మిదిసార్లు గెలిచి చ‌రిత్ర‌కెక్కారు. డీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త మాజీ సీఎం క‌రుణానిధి 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న ఏడు వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

కీల‌క ప‌ద‌వి
త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వం ఏర్పాటుకు టీవీకే సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో సెంగొట్టయన్ కీల‌క భూమిక పోషించే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వ ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన సీట్లు రాక‌పోవ‌డంతో ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి ఆయ‌న అనుభ‌వం అక్క‌ర‌కు రావ‌చ్చు. ఎందుకంటే అన్నాడీఎంకేతో ఆయ‌న‌కు ఐదు ద‌శాబ్దాల అనుబంధం ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వంలో గ‌తంలో ప‌లుమార్లు మంత్రి ప‌ద‌వులు కూడా నిర్వ‌హించారు. సెంగొట్టయన్‌కు ఉన్న అపార అనుభ‌వం కార‌ణంగా టీవీకే ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement