గుజరాత్‌లో ఆప్‌ గెలుపు ఛాన్స్‌ ఎంత? బీజేపీ చీఫ్‌ నడ్డా ఆసక్తికర సమాధానం

Gujarat First Phase Election: BJP Chief JP Nadda On AAP Chances - Sakshi

ఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఈ మేరకు విజయం వన్‌సైడ్‌ అంటూ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చెప్తున్నారు. తాజాగా బుధవారం ఓ జాతీయ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని మరోసారి ఉద్ఘాటించారు. అయితే ఫేజ్‌-1 ఎన్నికల్లో భాగంగా.. సౌరాష్ట్ర రీజియన్‌ ఆప్‌ ప్రభావం చూపెడుతుందా? సీట్లు కైవసం చేసుకుంటుందా? అనే ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఉత్తర ప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటమిని చవిచూసింది. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌ గెలిచిన మాట వాస్తవమే. అయితే, అక్కడ జరిగిన పోటీలో బీజేపీతో తలపడలేదు. కానీ,  గుజరాత్‌లో అలా కాదు. అక్కడ వాతావరణం అంతా పూర్తిగా బీజేపీకి అనుకూలంగానే ఉంది. కాబట్టి, ఆప్‌కు ఎలాంటి అవకాశాలు లేవు అని సమాధానం ఇచ్చారు. స్థానిక సంస్థ ఎన్నికలతో సహా ఏ ఎన్నికలనూ బీజేపీ వదిలిపెట్టబోదని జేపీ నడ్డా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇక ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే చేసిన ‘రావణ’ వ్యాఖ్యలపైనా జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ దిశానిర్దేశం లేకుండా పోయింది. అలాంటి పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు. బీజేపీకి భయపడుతుంది కాబట్టే.. ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది వాళ్ల మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తోంది అంటూ నడ్డా వ్యాఖ్యానించారు. 

ఇక రాహుల్‌ గాంధీని ఉద్దేశించి అసోం సీఎం హిమంత.. సద్దాం హుస్సేన్‌లా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. బహుశా ఆయన(అసోం సీఎం) కోణంలో చూడడానికి అతను(రాహుల్‌) అలా కనిపించి ఉంటారేమో అంటూ బదులిచ్చారు. 

గుజరాత్‌లో రెండు దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 1వ తేదీన(రేపు) తొలి దఫా, రెండ దఫా డిసెంబర్‌ 5వ తేదీన జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్‌ 8వ తేదీన ప్రకటిస్తారు. మంగళవారమే తొలి దఫా ప్రచార గడువు ముగియగా.. మొత్తం 182 సీట్లలో 89 సీట్లకు తొలి దశ ఎన్నిక జరగనుంది. 

ఇదీ చదవండి: అసెంబ్లీ బరిలో ఎమ్మెల్సీ కవిత!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top