అసెంబ్లీ బరిలో కవిత..

Kalvakuntla Kavitha To Contest As 2023 Elections Nizamabad Urban - Sakshi

మౌలిక వసతుల లేమి.. ఏళ్ల తరబడి సాగుతున్న భూగర్భ డ్రెయినేజీ పనులు.. వెనుక బడిన నగర సుందరీకరణ నేపథ్యంలో నగరాభివృద్ధిని పట్టాలెక్కించడానికి స్వయంగా సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ అంశం స్థానిక ప్రజల్లో ఆసక్తిని కలిగించడంతో పాటు అభివృద్ధిపై ఆశలను చిగురింపజేసింది. మరోవైపు రాజకీయ వర్గాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రానున్న ఎన్నికల్లో అర్బన్‌ నుంచి బరిలో దింపడమే పరమార్థమని అంచనాలు సాగుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాను పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయిస్తారని భావిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : వ్యవసాయ వనరులతో అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ముందంజలో ఉన్న నిజామాబాద్‌ జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అయితే జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌ నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్‌ అయి 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగర సుందరీకరణ పనుల విషయంలో పరిస్థితి ముందుకు పడడం లేదు. నిధులు వస్తున్నప్పటికీ వివిధ పనుల విషయంలో ఏళ్లతరబడి ఆలస్యం అవుతోంది. దీంతో నగర నవీకరణ వెనుకబడుతోంది. 1972లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ తప్ప కొత్త మాస్టర్‌ప్లాన్‌ను పట్టాలు ఎక్కించలేదు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ప్రారంభమైన భూగర్భ డ్రెయినేజీ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈ పనులు సాగుతూనే ఉన్నాయి. 

అంచనాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా హైదరాబాద్‌లో నిజామాబాద్‌ నగర అభివృద్ధి పనుల విషయమై సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో నిజామాబాద్‌ వస్తానని, ఈలోగా ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు ఖమ్మం వెళ్లి అక్కడ జరిగిన నగర అభివృద్ధిని చూసి రావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేవలం ఒక్క నిజామాబాద్‌ నగర అభివృద్ధి పనుల విషయమై సమీక్ష చేయడంపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధి పనుల విషయమై ప్రజల్లో చర్చ సాగుతోంది. అయితే వివిధ వర్గాల్లో మాత్రం రాజకీయ అంశాలపై సూక్ష్మ పరిశీలనలు చేస్తున్నారు.

 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత రెండోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచి ధర్మపురి అరి్వంద్‌ విజయం సాధించారు. తర్వాత కవిత ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వివిధ వర్గాల్లో  వేడెక్కుతున్నాయి. 

గత కొన్ని నెలల క్రితం మాత్రం కవిత బోధన్‌ లేదా ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచే బరిలో ఉంటారని చర్చ జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే బిగాల గణేషగుప్తాను ఈసారి నిజామాబాద్‌ పార్లమెంటు అభ్యరి్థగా బరిలోకి దించుతారని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కవిత నగరంపై ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే నగర అభివృద్ధి విషయమై ముఖ్యమంత్రితో సమీక్ష చేయించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఎన్నికలు ముందస్తుగా వచ్చినప్పటికీ, షెడ్యూల్‌ మేరకు వచ్చినా సమయం ఏడాది లోపే ఉండడంతో ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కల్వకుంట్ల కవితకు రాష్ట్ర కేబినెట్‌లోకి రావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశం ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేగానే శాసనసభలో అడుగుపెట్టి మంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.

2014 నుంచి 2019 వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కె కవిత రెండోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ విజయం సాధించారు.

40 ఏళ్ల క్రితం రూపొందించిన మాస్టర్‌ ప్లానే నగరానికి ఇప్పటికీ అమలవుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top