డీఏపీ రూ.1,200కే బస్తా

Govt hikes subsidy on DAP fertiliser by 140percent to rs 1,200 per bag - Sakshi

ఎరువుల రాయితీ పెంపు

బస్తాపై సబ్సిడీని రూ.500 నుంచి రూ.1,200 పెంచిన కేంద్రం

ఫలితంగా రైతులకు పాతధరకే డీఏపీ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం రైతులకు తీపికబురు అందించింది. డీఏపీపై సబ్సిడీని ఏకంగా 140 శాతం పెంచింది. ఫలితంగా రైతులకు పాత ధరకే... రూ. 1,200లకు బస్తా (50 కేజీలు) చొప్పున డీఏపీ దొరకనుంది. ‘రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా.. డీఏపీ ఎరువును పాతధరకే అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’ అని ప్రధానమంత్రి మోదీ బుధవారం ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు డీఏపీపై బస్తాకు రూ. 500 సబ్సిడీ చెల్లిస్తోంది. దాన్ని 140 శాతం పెంచి రూ.1,200లు చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల మూలంగా రైతులపై భారం పడకూడదనే ఉద్దేశంతో పెరిగిన మొత్తం భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కేంద్రంపై వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో రూ.14,774 కోట్ల అదనపు భారం పడనుంది.

గతేడాది డీఏపీ బస్తా రూ.1,700కు ఉండగా... అందులో రూ.500 కేంద్రం రాయితీ ఇవ్వడంతో రైతులకు రూ.1,200కే కంపెనీలు అమ్మాయి. అంతర్జాతీయంగా ఇటీవల ఫాస్ఫరిక్‌ ఆమ్లం, అమ్మోనియా ధరలు 60 నుంచి 70 శాతం పెరగడంతో డీఏపీ బస్తా ధర రూ.2,400కు చేరింది. కేంద్రం ఇచ్చే రూ.500 రాయితీ పోను రూ. 1,900లకు రైతులకు అమ్మాల్సిన పరిస్థితి. దీని ప్రకారం బస్తాపై రూ.700 పెంచుతున్నట్లు ఇఫ్కో ఏప్రిల్‌లో ప్రకటించినా... తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యంతో వెనక్కి తగ్గింది. అయినా కొన్ని కంపెనీలు ధరలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఎపీపై రాయితీని బస్తాకు రూ. 500 నుంచి రూ. 1,200కు పెంచాలని నిర్ణయించారు. అంటే బస్తా ఖరీదు రూ.2,400 రూపాయల్లో 1,200 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్న మాట. దాంతో రైతుకు 50 కేజీల డీఏపీ బస్తా రూ.1,200లకే లభించనుంది. అంతర్జాతీయంగా ఫాస్ఫరిక్‌ ఆమ్లం, అమ్మోనియా ధరలు పెరగడం వల్ల ఎరువుల ధర పెరిగినప్పటికీ దేశంలోని రైతులకు పాతధరలకే ఎరువులు అందజేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top