రాజకీయాల్లోకి నన్ను, సైన్యాన్ని లాగడం అన్యాయం | Gen MM Naravane slams Rahul Gandhi over brandishing his memoir in LS | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి నన్ను, సైన్యాన్ని లాగడం అన్యాయం

Apr 25 2026 8:11 AM | Updated on Apr 25 2026 8:53 AM

Gen MM Naravane slams Rahul Gandhi over brandishing his memoir in LS

పార్లమెంట్‌ సాక్షిగా తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ పుస్తకంపై రచయిత, మాజీ ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే స్పందించారు. తనను, సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం అన్యాయమని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లడఖ్‌ ఘర్షణలో మనం భూభాగం కోల్పోలేదని ఉద్ఘాటించిన ఆయన.. సైన్యం ఎల్లప్పుడూ రాజకీయాలకు దూరంగా, ప్రజల విశ్వాసంతో ముందుకు నడుస్తుందని చెప్పారు. 

2020లో లడఖ్‌లో భారత్‌–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత చైనా సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించిందా? లేదా? అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీనిపై ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరవణే స్పందిస్తూ.. 

‘‘ఆ సమయంలోనే నేను చెప్పాను. ప్రభుత్వం ఆ సమయంలో మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. చైనాకు మనం ఒక్క అంగుళం భూభాగం కూడా కోల్పోలేదు. ఈరోజు కూడా అదే మాట చెబుతున్నా. ఎవరైనా నమ్మకపోతే అది వారి ఇష్టం. ఎంత సాక్ష్యం చూపించినా.. నమ్మకానికి సిద్ధంగా లేని వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోలేరు కదా. సైనిక వ్యవహారాల్లో రాజకీయ నాయకత్వం నేరుగా జోక్యం చేసుకోదు. నిర్ణయాలు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకుంటుంది. ఆ కమిటీకి ప్రధాని అధ్యక్షత వహిస్తారు. 

నన్ను, సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం అన్యాయం. భారత సైన్యం ఎప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అదే మన ప్రజాస్వామ్య బలం. వ్యక్తిగతంగా ఓటు హక్కు ఉన్నా.. సంస్థగా మాత్రం అది రాజకీయ పార్టీకి కొమ్ము కాయదు. భారత ప్రజలు ఎప్పటికీ సైన్యంపై విశ్వాసం ఉంచారు. చిన్న చిన్న వివాదాలు ఆ బంధాన్ని దెబ్బతీయలేవు అని అన్నారాయన.  

నరవణే రాసిన “Four Stars of Destiny” అనే మెమోయిర్‌(జ్ఞాపకాల పుస్తకం) ఇంకా పబ్లిష్‌​ కాలేదు. ఈ పుస్తకం ప్రచురణకు సిద్ధంగా ఉన్నా, రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం 2023 నుంచి పెండింగ్‌లో ఉంది. కానీ కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్‌ సమావేశాల్లో దానిని ప్రదర్శించడం.. అందులోని కొన్ని భాగాలను ప్రస్తావించడంతో రాజకీయ వివాదం చెలరేగింది. 

అందులో నరవణే తన నాలుగు దశాబ్దాల సైనిక జీవితం, ముఖ్యంగా 2020 లడఖ్‌–చైనా ఘర్షణ.. గల్వాన్‌ లోయ సంఘటనలు, అగ్నిపథ్‌ నియామక పథకం వంటి అంశాలను ప్రస్తావించారు. లడఖ్‌ ఉద్రిక్తత సమయంలో తాను కేంద్రానికి ఆదేశాలు అడిగితే.. రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ “Jo Uchit Samjho Woh Karo” (మీకు సరైనదనిపిస్తే అదే చేయండి) అన్నారని నరవణే ప్రస్తావించారు. రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి మోదీ సర్కారు వెనుకాడిందని.. నిర్ణయాన్ని పూర్తిగా సైన్యానికి వదిలేసిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 

దీనిపై రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. “ప్రచురించని పుస్తకాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించడం సరైంది కాదు” అని అన్నారు. సభలో తీవ్ర వాగ్వాదాలు జరిగి.. స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షం నో కాన్ఫిడెన్స్‌ మోషన్‌ పెట్టేదాకా పరిస్థితి వెళ్లింది. కానీ అది తర్వాత వాయిస్‌ ఓటుతో కొట్టివేయబడింది.

అయితే.. ఈ దుమారంపై నరవణే ఇదివరకు కూడా స్పందించారు. ఆ సమయంలో ప్రభుత్వం తమను వదిలేయలేదని స్పష్టం చేశారు. మీకు సరైనదనిపిస్తే అదే చేయండి అనే వ్యాఖ్యలను రాజకీయ పక్షాలు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నిజానికి సర్కారు నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని, పరిస్థితి చెయ్యిదాటితే చైనా సైనికులపై కాల్పులు జరపడానికి అన్ని అధికారాలూ తమకు ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement