breaking news
MM Naravane
-
పాక్ గాలితీసిన భారత మాజీ ఆర్మీచీఫ్
కోల్‌కతా: భారత రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవణే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- అమెరికా మధ్య పాక్ మధ్యవర్తిత్వం ఒట్టిమాటే అన్నారు. పాక్ చేసేది మధ్యవర్తిత్వం కాదని కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమేనన్నారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత మాజీ సైన్యాధిపతి నరవణే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకం విడుదల కాకముందే దేశంలో ప్రకంపనలు సృష్టించింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని పలు అంశాలను ప్రస్థావించడంతో లోక్‌సభలో పెద్ద దుమారం చేలరేగింది. కాగా తాజాగా నరవణే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు.నరవణే మాట్లాడుతూ" ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలలో పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెబుతోంది. కానీ అది కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమే, జాతీయ భద్రత ఎప్పుడూ ఆర్థిక భద్రతపైనే ముడిపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థే అన్నింటిని నడిపిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఒడిదొడుకులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రయత్నాలు ఎల్లప్పుడూ స్వయం సమృద్ధిపైనే ఉండాలి" అని అన్నారు.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా ఇవి ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
రాజకీయాల్లోకి నన్ను, సైన్యాన్ని లాగడం అన్యాయం
పార్లమెంట్ సాక్షిగా తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై రచయిత, మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే స్పందించారు. తనను, సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం అన్యాయమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లడఖ్ ఘర్షణలో మనం భూభాగం కోల్పోలేదని ఉద్ఘాటించిన ఆయన.. సైన్యం ఎల్లప్పుడూ రాజకీయాలకు దూరంగా, ప్రజల విశ్వాసంతో ముందుకు నడుస్తుందని చెప్పారు. 2020లో లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత చైనా సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించిందా? లేదా? అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీనిపై ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరవణే స్పందిస్తూ.. ‘‘ఆ సమయంలోనే నేను చెప్పాను. ప్రభుత్వం ఆ సమయంలో మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. చైనాకు మనం ఒక్క అంగుళం భూభాగం కూడా కోల్పోలేదు. ఈరోజు కూడా అదే మాట చెబుతున్నా. ఎవరైనా నమ్మకపోతే అది వారి ఇష్టం. ఎంత సాక్ష్యం చూపించినా.. నమ్మకానికి సిద్ధంగా లేని వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోలేరు కదా. సైనిక వ్యవహారాల్లో రాజకీయ నాయకత్వం నేరుగా జోక్యం చేసుకోదు. నిర్ణయాలు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకుంటుంది. ఆ కమిటీకి ప్రధాని అధ్యక్షత వహిస్తారు. నన్ను, సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం అన్యాయం. భారత సైన్యం ఎప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అదే మన ప్రజాస్వామ్య బలం. వ్యక్తిగతంగా ఓటు హక్కు ఉన్నా.. సంస్థగా మాత్రం అది రాజకీయ పార్టీకి కొమ్ము కాయదు. భారత ప్రజలు ఎప్పటికీ సైన్యంపై విశ్వాసం ఉంచారు. చిన్న చిన్న వివాదాలు ఆ బంధాన్ని దెబ్బతీయలేవు అని అన్నారాయన. నరవణే రాసిన “Four Stars of Destiny” అనే మెమోయిర్(జ్ఞాపకాల పుస్తకం) ఇంకా పబ్లిష్ కాలేదు. ఈ పుస్తకం ప్రచురణకు సిద్ధంగా ఉన్నా, రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం 2023 నుంచి పెండింగ్‌లో ఉంది. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశాల్లో దానిని ప్రదర్శించడం.. అందులోని కొన్ని భాగాలను ప్రస్తావించడంతో రాజకీయ వివాదం చెలరేగింది. అందులో నరవణే తన నాలుగు దశాబ్దాల సైనిక జీవితం, ముఖ్యంగా 2020 లడఖ్–చైనా ఘర్షణ.. గల్వాన్ లోయ సంఘటనలు, అగ్నిపథ్ నియామక పథకం వంటి అంశాలను ప్రస్తావించారు. లడఖ్ ఉద్రిక్తత సమయంలో తాను కేంద్రానికి ఆదేశాలు అడిగితే.. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ “Jo Uchit Samjho Woh Karo” (మీకు సరైనదనిపిస్తే అదే చేయండి) అన్నారని నరవణే ప్రస్తావించారు. రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి మోదీ సర్కారు వెనుకాడిందని.. నిర్ణయాన్ని పూర్తిగా సైన్యానికి వదిలేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. “ప్రచురించని పుస్తకాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం సరైంది కాదు” అని అన్నారు. సభలో తీవ్ర వాగ్వాదాలు జరిగి.. స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేదాకా పరిస్థితి వెళ్లింది. కానీ అది తర్వాత వాయిస్ ఓటుతో కొట్టివేయబడింది.అయితే.. ఈ దుమారంపై నరవణే ఇదివరకు కూడా స్పందించారు. ఆ సమయంలో ప్రభుత్వం తమను వదిలేయలేదని స్పష్టం చేశారు. మీకు సరైనదనిపిస్తే అదే చేయండి అనే వ్యాఖ్యలను రాజకీయ పక్షాలు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నిజానికి సర్కారు నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని, పరిస్థితి చెయ్యిదాటితే చైనా సైనికులపై కాల్పులు జరపడానికి అన్ని అధికారాలూ తమకు ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు.


