
కుప్పకూలిన వడోదర–ఆనంద్ వంతెన
నదిలో పడి 13 మంది సజీవ సమాధి
పలువురికి గాయాలు
నదీప్రవాహంలో కొట్టుకుపోయిన పలు వాహనాలు
ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు
వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితంనాటి పాత వంతెన కుప్పకూలిన ఘటనలో 13 మంది వాహనదారులు జలసమాధి అయ్యారు. నదీప్రవాహంలో పడి ప్రయాణికులతోసహా ట్రక్కులు, వ్యాన్‌లు, ఆటో, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు.
మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు వడోదర జిల్లాలోని మహీసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో ఈ ఘోరం జరిగింది. పద్రా పట్టణ సమీపంలో నిర్మించి ఈ వంతెన కూలడంతో వడోదర, ఆనంద్ నగరాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపో యాయి.
నదీ ప్రవాహంలో నిర్మించిన రెండు పిల్లర్ల మధ్యలోని శ్లాబులు పూర్తిగా కుప్పకూలడంతో ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉందని వడోదర రూరల్ ఎస్పీ రోహన్ ఆనంద్ చెప్పారు. నదిలో పడగా నే కొందరిని స్థానికులు కాపాడారు. రక్షించిన వారిలో గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్రిడ్జ్ కూలడంతో ఒక ట్యాంకర్ కొనకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. దీంతో 4 గంటలపాటు శ్రమించి వెనక్కిలాగారు. కానీ అందులోని డ్రైవర్ ఆచూకీ గల్లంతైంది.
బిడ్డను కాపాడాలంటూ తల్లి రోదన
బ్రిడ్జి కూలినప్పుడు కొన్ని వాహనాలు నది ప్రవాహం మధ్యలో పడి కొట్టుకుపోతే మరికొన్ని ఒడ్డు వైపున పడిపోయాయి. అప్పుడు ఒక ప్రయాణికుడు కారుతోసహా నదినీటిలో చిక్కుకు పోయాడు. అతని తల్లి మాత్రం క్షేమంగా బయటపడింది. నడుం లోతు ఉన్న నీటిలో నిలబడి ఒడ్డు వైపున్న స్థానికులను తల్లి ఏడుస్తూ వేడుకుంటున్న వీడియో చూపరులను కంటతడి పెట్టించింది. ‘‘నా బిడ్డ ఇందులో ఇరుక్కుపోయాడు.
నది నీటిలో మునిగిపోయి విలవిల్లాడిపోతున్నాడు. కాపాడండయ్యా’’ అంటూ ఆమె దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్త, కుమారుడు, కుమార్తె, అల్లుడితో కలిసి కారులో బాగ్దానాకు వెళ్తోంది. కారు నీటిలో పడినప్పుడు వెనకవైపు అద్దం పగలగొట్టి బయ టపడింది. కుమారుడు మాత్రం నదిలో మునిగిన వాహనంలో ఇరుక్కుపోయాడు.
దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ
దుర్ఘటన వార్త తెల్సి మోదీ, రాష్ట్ర సీఎంభూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగా త్రులకు తలో రూ.50వేల సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.4 లక్షలు ఇస్తామని సీఎం చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వంతెన కూలడంతో ఇలాంటి పాత వంతెన పటిష్టతపై సమీక్ష జరపాలని రాష్ట్ర అధికారులకు ప్రధాని సూచించారు.
1981లో వంతెన నిర్మాణాన్ని మొదలెట్టి 1985లో వాహన రాకపో కలకు అందుబాటులోకి తెచ్చారు. మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 23 పిల్లర్లతో నదిపై 900 మీటర్ల పొడవునా బ్రిడ్జిని నిర్మించారు. అయితే వడోదర, ఆనంద్ నగరాలను కలిపే ఏకైక వంతెన కావడంతో దీనిపై వాహన రద్దీ ఎక్కువై పాడైందని స్థానికులు చెబుతున్నారు. కొత్త వంతెన కోసం మూడు నెలల క్రితమే రూ.212 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయని తెలు స్తోంది. వంతెన పరిస్థితి దారుణంగా ఉందని, రాకపోకలను నిలిపివేయాలని 2017లోనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.