breaking news
Water grave
-
గుజరాత్లో ఘోరం
వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితంనాటి పాత వంతెన కుప్పకూలిన ఘటనలో 13 మంది వాహనదారులు జలసమాధి అయ్యారు. నదీప్రవాహంలో పడి ప్రయాణికులతోసహా ట్రక్కులు, వ్యాన్లు, ఆటో, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు వడోదర జిల్లాలోని మహీసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో ఈ ఘోరం జరిగింది. పద్రా పట్టణ సమీపంలో నిర్మించి ఈ వంతెన కూలడంతో వడోదర, ఆనంద్ నగరాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపో యాయి. నదీ ప్రవాహంలో నిర్మించిన రెండు పిల్లర్ల మధ్యలోని శ్లాబులు పూర్తిగా కుప్పకూలడంతో ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉందని వడోదర రూరల్ ఎస్పీ రోహన్ ఆనంద్ చెప్పారు. నదిలో పడగా నే కొందరిని స్థానికులు కాపాడారు. రక్షించిన వారిలో గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్రిడ్జ్ కూలడంతో ఒక ట్యాంకర్ కొనకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. దీంతో 4 గంటలపాటు శ్రమించి వెనక్కిలాగారు. కానీ అందులోని డ్రైవర్ ఆచూకీ గల్లంతైంది.బిడ్డను కాపాడాలంటూ తల్లి రోదనబ్రిడ్జి కూలినప్పుడు కొన్ని వాహనాలు నది ప్రవాహం మధ్యలో పడి కొట్టుకుపోతే మరికొన్ని ఒడ్డు వైపున పడిపోయాయి. అప్పుడు ఒక ప్రయాణికుడు కారుతోసహా నదినీటిలో చిక్కుకు పోయాడు. అతని తల్లి మాత్రం క్షేమంగా బయటపడింది. నడుం లోతు ఉన్న నీటిలో నిలబడి ఒడ్డు వైపున్న స్థానికులను తల్లి ఏడుస్తూ వేడుకుంటున్న వీడియో చూపరులను కంటతడి పెట్టించింది. ‘‘నా బిడ్డ ఇందులో ఇరుక్కుపోయాడు. నది నీటిలో మునిగిపోయి విలవిల్లాడిపోతున్నాడు. కాపాడండయ్యా’’ అంటూ ఆమె దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్త, కుమారుడు, కుమార్తె, అల్లుడితో కలిసి కారులో బాగ్దానాకు వెళ్తోంది. కారు నీటిలో పడినప్పుడు వెనకవైపు అద్దం పగలగొట్టి బయ టపడింది. కుమారుడు మాత్రం నదిలో మునిగిన వాహనంలో ఇరుక్కుపోయాడు.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీదుర్ఘటన వార్త తెల్సి మోదీ, రాష్ట్ర సీఎంభూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగా త్రులకు తలో రూ.50వేల సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.4 లక్షలు ఇస్తామని సీఎం చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వంతెన కూలడంతో ఇలాంటి పాత వంతెన పటిష్టతపై సమీక్ష జరపాలని రాష్ట్ర అధికారులకు ప్రధాని సూచించారు. 1981లో వంతెన నిర్మాణాన్ని మొదలెట్టి 1985లో వాహన రాకపో కలకు అందుబాటులోకి తెచ్చారు. మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 23 పిల్లర్లతో నదిపై 900 మీటర్ల పొడవునా బ్రిడ్జిని నిర్మించారు. అయితే వడోదర, ఆనంద్ నగరాలను కలిపే ఏకైక వంతెన కావడంతో దీనిపై వాహన రద్దీ ఎక్కువై పాడైందని స్థానికులు చెబుతున్నారు. కొత్త వంతెన కోసం మూడు నెలల క్రితమే రూ.212 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయని తెలు స్తోంది. వంతెన పరిస్థితి దారుణంగా ఉందని, రాకపోకలను నిలిపివేయాలని 2017లోనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
ఇద్దరు యువకుల జల సమాధి
చందర్లపాడు : ఇంటికి కూత వేటుదూరంలో ఉన్న కృష్ణానదిలోకి మిత్రులతో కలసి స్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకుల ప్రాణాలను మృత్యువు కబళించింది. దీంతో ఇద్దరి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కాసరబాదలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన పలువురిని కలచివేసింది. గ్రామానికి చెందిన వాసిరెడ్డి వెంకట కమల ప్రవీణ్(18), అరవపల్లి ఫణిశేఖర్(32) ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లలో నివశిస్తుంటారు. ప్రవీణ్ గుంటూరు జిల్లా చేబ్రోలు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫణిశేఖర్ ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో టాక్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలసి దీపావళి పండుగను చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణానదిలోకి మిత్రులైన గోకర ్లయోగానందం, ఉదయ్‌తో కలసి స్నానానికి వెళ్లారు. వీరితో పాటు ప్రవీణ్ తమ్ముడు కార్తీక్ ఉన్నాడు. నదిలో స్నానం చేస్తుండగా ప్రవీణ్ లోతుగా ఉండే ప్రదేశంలోకి వెళ్లాడు. నీటిలో మునిగిపోతున్న అతడిని కాపాడేందుకు ఫణిశేఖర్ వెళ్లాడు. అక్కడ ఇద్దరూ నీట మునిగి ఊపిరాడక మరణంచాడు. దీనిని గమనించిన కార్తీక్ ఒడ్డుకు వచ్చి తండ్రి చంద్రశేఖర్‌కు ఫోన్ ద్వారా సమాచారమందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి హుటాహుటిన వచ్చారు. జాలర్ల సాయంతో గాలించి, ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ శర్మ, ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నందిగామ తరలించారు. కాయకష్టంతో పిల్లలను చదివించారు.. చంద్రశేఖర్, సుభద్ర దంపతులకు ప్రవీణ్, కార్తీక్ సంతానం. చంద్రశేఖర్ తనకున్న రెండెకరాల పొలాన్ని సాగుచేస్తూ, ప్రైవేటు పాల డెయిరీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. సుభద్ర అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సీతారామయ్య, శ్రీలక్ష్మి దంపతులకు ఫణీంద్ర, సంకీర్తన సంతానం. సీతారామయ్యకు 1.50 సెంట్ల భూమి ఉంది. తమ పొలాన్ని సాగుచేసుకుంటూనే సీతారామయ్య దంపతులు కూలి పనులు చేసుకుని పిల్లలను చదివించారు. ఫణిశేఖర్‌ను ఎంసీఏ వరకు చదివించారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఫణిశేఖర్‌కు ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటులో టాక్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. గత రెండేళ్లుగా ఉద్యోగం చేస్తూ కుటుంబసభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూ చెల్లెలు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇటీవల నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలు కూడా రాశాడు. ఇద్దరి మరణంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.