
సాక్షి, న్యూఢిల్లీ: నీటిని కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్తును కాపాడుకోగలమని, అప్పుడే అందరం కలసికట్టుగా జీవించగలుగుతామని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. జల సంరక్షణ రోజువారీ జీవితంలో అంతర్భాగం కావాలని, నీటి సంరక్షణకు ప్రాధాన్యమివ్వడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఉదాహరణగా నిలవాలని ఆయన ప్రజాప్రతినిధులకు, పౌరులకు పిలుపునిచ్చారు.
నీటి వనరుల నిర్వహణపై సమగ్ర విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర జలశక్తి శాఖ జాతీయ జల అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు 4వ జాతీయ జల అవార్డులను పురస్కార గ్రహీతలకు అందించారు.
దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామం, ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ (3వ స్థానం), హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, క్యాంపస్ అవార్డులను అందుకున్నాయి. అలాగే, జాతీయ జల అవార్డుల్లో మూడో ఉత్తమ రాష్ట్రంగా బిహార్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ అవార్డును పంచుకోగా, ఉత్తమ రాష్ట్రాల విభాగంలో మధ్యప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది.