స్వార్థ రాజకీయాలొద్దు

Farewell ceremony for outgoing President Ram Nath Kovind - Sakshi

జాతి ప్రయోజనాలే పరమావధి

ఎంపీలకు రాష్ట్రపతి పిలుపు

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో కోవింద్‌ వీడ్కోలు ప్రసంగం

న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సభ్యులు జాతి ప్రయోజనాలే పరమావధిగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. శనివారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. ప్రజలు శాంతి, సామరస్యంతో మెలగాలన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకుంది. కానీ అందుకు గాంధేయ మార్గాన్నే అనుసరించాలి.

నేనెల్లప్పుడూ ఎంపీలతో కూడిన పెద్ద కుటుంబంలో సభ్యుడిననే భావించుకున్నాను. కుటుంబంలోలానే పార్లమెంట్‌లోనూ విభేదాలు తలెత్తుతుంటాయి. ఒక్కో పార్టీకి ఒక్కో అభిప్రాయముండొచ్చు. జాతి ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి’’ అన్నారు. రాష్ట్రపతిగా సేవ చేసే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటానన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు.

‘‘విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులు, ఎంపీలకు కృతజ్ఞతలు. పార్లమెంట్‌ కార్యక్రమాలను సజావుగా నిర్వహించి ఘన సంప్రదాయాలను కొనసాగించిన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కూడా కృతజ్ఞతలు’’ అన్నారు. రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి తుది ప్రసంగం చేయనున్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మోదీ, ఓం బిర్లా, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

వెంకయ్య వీడ్కోలు విందు
రాష్ట్రపతికి వెంకయ్య తన నివాసంలో వీడ్కోలు విందు ఇచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన కోవింద్‌ దంపతులను వెంకయ్య దంపతులు సాదరంగా ఆహ్వానించారు. విందులో తెలుగు వంటకాలు వడ్డించారు. విందు ఇచ్చారు. రాష్ట్రపతిగా కోవింద్‌హుందాగా బాధ్యతలు నిర్వహించారని వెంకయ్య కొనియాడారు. కోవింద్‌ జీవితం ఆదర్శనీయమైందని, ఆయన ఆలోచనలు, ప్రసంగాల నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని అన్నారు.

న్యాయవాది నుంచి రాష్ట్రపతి దాకా...
దేశ 14వ రాష్ట్రపతిగా ఐదేళ్లపాటు సేవలందించిన రామ్‌నాథ్‌ కోవింద్‌ సాధారణ న్యాయవాదిగా జీవితం ఆరంభించారు. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో పార్లమెంట్‌ సభ్యుడిగా, గవర్నర్‌గా సేవలందించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 2017 జూలై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది.

కోవింద్‌ 1945 అక్టోబర్‌ 1న ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ జిల్లా పరౌంఖ్‌ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. 1971లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వొకేట్‌–ఆన్‌–రికార్డుగా ఎంపికయ్యారు. 1980 నుంచి 1993 దాకా సుప్రీంకోర్టులో కేంద్రం తరఫు న్యాయవాదిగా పనిచేశారు. అణగారిన వర్గాలకు, ప్రధానంగా మహిళలు, పేదలకు ఉచితంగా న్యాయ సేవలందించారు.

బీజేపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1994  నుంచి 2006 దాకా రెండుసార్లు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో బిహార్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. బిహార్‌ విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017లో అధికార ఎన్డీయే తరఫున రాష్ట్రపతిగా ఘన విజయం సాధించారు.

కె.ఆర్‌.నారాయణన్‌ తర్వాత రాష్ట్రపతి అయిన రెండో దళితుడు కోవింద్‌. పుస్తక పఠనమంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. సామాజిక సాధికారతకు విద్యే ఆయుధమని చెబుతుంటారు. దివ్యాంగులు, అనాథలకు సమాజంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచిస్తుంటారు.

రాష్ట్రపతి హోదాలో కోవింద్‌ 33 దేశాల్లో పర్యటించారు. సైనిక దళాల సుప్రీం కమాండర్‌గా 2018 మేలో సియాచిన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమైన కుమార్‌ పోస్టును కూడా ఆయన సందర్శించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top