‘ఆమె’ను కాపాడండి.. జైశంకర్‌కు జీహెచ్‌ఎంసీ మాజీ కార్పొరేటర్‌ విజ్ఞప్తి! | Family Appeals to EAM Jaishankar on X to Rescue | Sakshi
Sakshi News home page

‘ఆమె’ను కాపాడండి.. జైశంకర్‌కు జీహెచ్‌ఎంసీ మాజీ కార్పొరేటర్‌ విజ్ఞప్తి!

Nov 21 2025 5:42 PM | Updated on Nov 21 2025 7:21 PM

Family Appeals to EAM Jaishankar on X to Rescue

సాక్షి,హైదరాబాద్‌: తక్కువ పని ఎక్కువ వేతనం వస్తోందంటూ ఆశ చూపించడంతో ఓ మహిళ ఏజెంట్‌ చేతిలో మోసపోయింది. గల్ఫ్‌ దేశంలో యజమానుల చేతుల్లో చిత్ర హింసలకు గురవుతోంది. పాస్‌పోర్టు లేకపోవడంతో గల్ఫ్‌ దేశం వదిలి రాలేక.. అక్కడే ఉండలేక నానా ఇబ్బందులు పడుతోందని, వెంటనే జోక్యం చేసుకుని ఆమెకు విముక్తి కలిగించాలని కోరుతూ.. జీహెచ్‌ఎంసీ మాజీ కార్పొరేటర్‌ కేంద విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. 

హైదరాబాద్‌కు చెందిన ఫౌజియా బేగమ్ అనే మహిళ మోసపూరిత ఏజెంట్ వలలో చిక్కుకుని ఒమన్‌లో ఇబ్బందులు పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంఐఎం నేత మాజీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ అహ్మదుల్లా ఖాన్ ఎంబీటీ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు.

ఫౌజియా బేగమ్ భర్తతో విడాకులు తీసుకుని ఖైరతాబాద్‌లో నివసిస్తోంది. బెంగుళూరుకు చెందిన సిద్ధిఖీ అనే పాస్‌పోర్టు ఏజెంట్, ఒమన్‌లో ఇంటిపని చేస్తే నెలకు భారత్‌లో వచ్చే సంపాదన కంటే అధిక మొత్తంలో వస్తుందని ఆశ చూపించి ఆమెను అక్కడికి పంపించాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రెండు ఇళ్లలో పని చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు, ఆమె పాస్‌పోర్టును ఇవ్వకుండా రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

ఈ మేరకు అహ్మదుల్లా ఖాన్‌.. జైశంకర్‌కు లేఖ రాసి, ఆమె ప్రస్తుతం నార్త్ వెస్ట్ ఒమన్‌లోని ఆల్ బురైనీ ప్రాంతంలో ఉన్నారని వివరించారు. ఆమెను కాపాడి సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని కోరారు. మా సోదరి ఏజెంట్ వలలో చిక్కుకుంది. ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. దయచేసి వెంటనే చర్యలు తీసుకుని ఆమెను రక్షించండి’అని కోరారు. అహ్మదుల్లా ఖాన్‌ విజ్ఞప్తిపై ఓమన్‌లోని భారత్‌ రాయబార కార్యాలయం స్పందించింది. త్వరలోనే బాధితురాల్ని క్షేమంగా భారత్‌కు తరలించే ప్రయత్నం చేస్తామని ఎక్స్‌ వేదికగా స్పందించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement