‘నాకు సిగ్గేస్తుంది.. ఫోటోలు తీయొద్దని చెప్పు’

Elephant Complaining About People Taking Her Pics To Mahout - Sakshi

చెన్నై: మనుషులు ప్రైవసీకే విలువ ఇవ్వం.. ఇక జంతువుల ప్రైవసీని పట్టించుకుంటామా.. లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడంటే అప్పుడు విపరీతంగా ఫోటోలు తీయడం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం. ఇదే పని చాలామందికి. ఇక జంతువులను ఫోటోలు, వీడియోలు తీయడం కొందరికి చాలా సరదా. వాటికి ఇబ్బంది కలగనంతవరకు ఓకే. కానీ చిరాకు అనిపించింది అనుకోండి.. అప్పుడు మన ఫోటో గొడెక్కుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఫోటోలంటే సిగ్గుపడే ఆ ఏనుగు తనను ఫోటోలు తీయొద్దని చెప్పమంటూ మావటి దగ్గరకి వెళ్లి ఎంతో ముద్దుగా చెప్తుంది. ఆ వ్యక్తి ఏనుగును కన్విన్స్‌ చేసి.. ఫోటోలు దిగడానికి ఒప్పిస్తాడు. ప్రసుత్తం వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (చదవండి: గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు దాడి)

ఆ వివరాలు.. ఈ వీడియో తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయంలో తీశారు. ఇక దీనిలో కనిపించేది ఆండాల్‌ అనే ఆడ ఏనుగు. ఇక వీడియోలో ఓ గుమ్మంలో మావటి కూర్చుని ఉంటాడు. ఏనుగు అతడి దగ్గరకు వెళ్లి తన భాషలో మావటితో ‘ఫోటోలు తీయొద్దని చెప్పు.. నాకు సిగ్గేస్తుంది’ అని చెప్తుంది. అతడు ఏనుగు తొండాన్ని కౌగిలించుకుని.. ‘పర్లేదు.. వాళ్లు నీతో ఫోటో దిగాలని ఆశపడుతున్నారు. వెళ్లి దిగు’ అంటూ నచ్చజెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక మావటి అడిగిన ప్రశ్నలకు ఏనుగు తల ఊపుతూ సమాధానాలు ఇవ్వడం వీడియోలో హైలెట్‌. ఏనుగు-మావటిల మధ్య జరిగిన సంభాషణ తీరు చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఎంత ముద్దుగా మాట్లాడుతుందో.. భాష తెలియకపోతనేం.. భావం అర్థం అవుతుంది కదా’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top