ప్రధాన్‌ను బర్తరఫ్‌ చేయండి  | Education minister resignation over NEET paper leak, Rahul Gandhi demands | Sakshi
Sakshi News home page

ప్రధాన్‌ను బర్తరఫ్‌ చేయండి 

May 17 2026 2:31 AM | Updated on May 17 2026 2:31 AM

Education minister resignation over NEET paper leak, Rahul Gandhi demands

నీట్‌పై ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ డిమాండ్‌ 

న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీ ఉదంతం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని, లేదా ఈ వైఫల్యానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ప్రదాని మోదీని శనివారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ కుమ్మక్కై దేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయని, ఫలితంగా 22 లక్షల మంది నీట్‌ అభ్యర్థుల ఆకాంక్షలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘నీట్‌కు రెండు రోజుల ముందుగానే వాట్సాప్‌లో ప్రశ్నపత్రం లీకైన విషయం దేశం యావత్తూ తెలిసిపోయింది. ఈ విషయంలో తానేమీ చేయలేనని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అంటున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీల కట్టడికి పార్లమెంట్‌ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ కమిటీలో ఉండటమే ఇందుకు కారణం’అని రాహుల్‌ ఎక్స్‌లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ‘దేశం మూలాలపైనే మీ ప్రభుత్వం దెబ్బకొట్టింది. 

కేవలం డబ్బు సంపాదన కోసమే విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లు, ప్రొఫెసర్ల పదవుల్లో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సంబం«దీకులను కూర్చోబెట్టారు. ఇదో పెద్ద అక్రమ కూటమి’అని రాహుల్‌ ఆరోపించారు. ఈ కూటమి దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందన్నారు. ‘ఓ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ అవ్వాలంటే కావాల్సింది పరిజ్ఞానం అనుభవం కాదు, ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన వ్యక్తి అయి ఉంటే చాలు. ఈ విషయం దేశంలో అందరికీ తెలుసు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు అనుగుణంగా లేని వారు వైస్‌ చాన్స్‌లర్‌ అయ్యే అవకాశమేలేదన్నారు. అందుకే, ఇప్పటి వరకు కనీసం 80సార్లు పరీక్ష పేర్లు లీకై, 2 కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆరోపించారు.  

Advertisement
 
Advertisement
Advertisement