ఛండీగఢ్: మొహాలీ–ఖరార్ ప్రాంతంలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖరార్‌లోని వెస్టన్ టవర్ కిటికీలోంచి నోట్ల కట్టలున్న బ్యాగ్‌లను విసిరేశారు. భూ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు సోదాలు ప్రారంభించిన కొద్దిసేపటికే తొమ్మిదో అంతస్తులోని ఒక ఫ్లాట్ నుంచి నగదుతో నిండిన ఒక బ్యాగ్‌ను కిందకు విసిరారు.
వ్యాపారవేత్త నితిన్ గోహల్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న ఒక డ్రైవర్ ఆ బ్యాగ్‌ను తీసుకుని, వాహనంలో అక్కడి నుంచి పారిపోయాడు. డ్రైవర్, వాహనం, నగదు కదలికలను ఈడీ బృందాలు ప్రస్తుతం గాలిస్తున్నాయి. మరోవైపు, ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఆ ప్రాంగణంలో కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
అక్కడా ఈడీ అధికారులు గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టి రెండు బ్యాగులను స్వా«దీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు ఫ్లాట్‌కు చేరుకునేలోపు డబ్బును పారవేసే ప్రయత్నంలో భాగంగా, రెండు సంచులను భవనం నుంచి బయటకు విసిరేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. భవనం నుంచి సంచులను విసిరేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
12 ప్రాంతాల్లో సోదాలు..
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, భూ లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ మొహాలీ–చండీగఢ్ ప్రాంతంలోని దాదాపు 12 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (జీఎమ్‌ఏడీఏ) ద్వారా భూ వినియోగ మార్పు (సీఎల్‌యూ) అనుమతుల మంజూరులో అవకతవకలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. కొన్ని బిల్డర్ గ్రూపులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల మధ్య సమన్వయం చేయడానికి వ్యాపారవేత్త నితిన్ గోహల్ సహకరించారనే ఆరోపణలపై ఈడీ ఈ దాడులు నిర్వహించింది. స్వా«దీనం చేసుకున్న సొమ్ము రూ. 21 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రికవరీ గురించి గానీ, డబ్బుతో ఉన్న రాజకీయ సంబంధాల గురించి గానీ ఈడీ ఇంకా ఎలాటి అధికారిక ప్రకటనా చేయలేదు.


