పది గంటలకు పైగా.. కవితను ఈడీ ఎంతసేపైనా ప్రశ్నించొచ్చా?

Delhi Liquor Scam Updates: Why ED Questions Kavitha Hours - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర హైటెన్షన్‌ నెలకొంది. లిక్కర్‌ స్కాం కేసులో.. ఇవాళ (మార్చి 20, 2022 సోమవారం) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈ ఉదయం నుంచి విచారిస్తోంది ఈడీ. దాదాపు పది గంటలు గడిచినా.. ఆమె ఇంకా ఈడీ ఆఫీస్‌లోనే ఉండడం గమనార్హం. దీంతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు రాత్రిపూట మహిళను విచారించడం నిబంధనలకు విరుద్ధమంటూ.. ఈడీ తీరును తప్పుబట్టిన ఆమె కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ,  పీఎంఎల్‌ఏ యాక్ట్‌ ప్రకారం.. అనుమానితులను ఎంతసేపైనా ప్రశ్నించే అధికారం ఉంది ఈడీకి. ఇక ఈ కేసులో అనుమానితురాలిగానే కవిత పేరును ఈడీ హైలెట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన.. ఆమెను ఎంత సేపు విచారిస్తారనేదానిపై స్పష్టత లేకుంది.  

ఈ ఉదయం నుంచి అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ముఖాముఖి విచారించారు అధికారులు. సౌత్‌ గ్రూప్‌తో లింకులకు సంబంధించి వివరాలను రాబట్టారు. అయితే.. ఇవాళ పిళ్లై కస్టడీ ముగియడంతో ఢిల్లీ స్పెషల్‌ కోర్టుకు తరలించగా.. కోర్టు జ్యుడిషియల్‌కస్టడీ విధించడంతో పిళ్లైను తీహార్‌ జైలుకు తరలించారు. ఏప్రిల్‌ 3వ తేదీ వరకు  కస్టడీలోనే ఉండనున్నాడు పిళ్లై. ఇక పిళ్లై వెళ్లిపోయాక.. సాయంత్రం నుంచి కవిత ఒక్కరినే ప్రశ్నించినట్లు తొలుత భావించారు. అయితే.. ఇక్కడే ట్విస్ట్‌ చోటు చేసుకుంది. 

ఈ కేసులో నిందితులైన అమిత్‌ అరోరా, మనీశ్‌ సిసోడియాలతో కలిపి సాయంత్రం నుంచి కల్వకుంట్ల కవితను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.  మరోవైపు ఈడీకి కవిత తరపు న్యాయవాదుల బృందం చేరుకోగా.. జోరుగా వాన పడుతున్నా లెక్క చేయకుండా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బయట ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ తరుణంలో బయట భారీగా పోలీసులు మోహరించడంతో.. అక్కడ ముందుముందు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

ఈడీ ఆఫీస్‌లో కవిత విచారణ.. లైవ్‌ అప్‌డేట్స్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top