వర్క్‌ ఫ్రం హోం.. పరిశ్రమల మూసివేత

Delhi Govt Give Work From Home And Closure of Industries for Air Pollution - Sakshi

వాయు కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో వాయు కాలుష్యం కట్టడికి వర్క్‌ ఫ్రం హోం, పరిశ్రమల మూసివేత వంటి ప్రతిపాదనలను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలు చేశాయని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ శనివారం కొన్ని అత్యవసర చర్యలను ప్రకటించారు. ఇందులో..వారం పాటు బడుల మూసివేత, నిర్మాణరంగ కార్యకలాపాల నిలిపివేత, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం విధానం అమలు వంటివి ఉన్నాయి.

ఈ ప్రతిపాదనలపై సోమవారం ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలు సమావేశమై చర్చించాయని మంత్రి రాయ్‌ తెలిపారు.   సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంజాబ్, రాజస్తాన్, యూపీ, హరియాణా యంత్రాంగాలు కూడా ఈ భేటీలో పాల్గొన్నాయన్నారు. త్వరలోనే ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేయనుందని రాయ్‌ తెలిపారు. 

ఢిల్లీ  కాలుష్యంపై రైతులను నిందించొద్దు
ఢిల్లీలో వాయు కాలుష్యానికి రైతులను నిందించవద్దని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ పేర్కొన్నారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్లే వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చలేదనే విషయాన్ని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మొత్తం వాయుకాలుష్యంలో పంట వ్యర్థాల దహనం 10% మాత్రమే కారణమని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top