ఢిల్లీకి తప్పిన ఉగ్ర ముప్పు! ఆయుధాలతో చిక్కిన ఆరుగురు

Delhi: 6 arrested with over 2,000 cartridges before Independence Day - Sakshi

2,251 తూటాలు స్వాధీనం

పంద్రాగస్టు నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం

విక్టోరియా మెమోరియల్‌ హాల్‌పై డ్రోన్‌ 

కోల్‌కతాలో ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్టు

కోల్‌కతా: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఢిల్లీకి భారీ ఉగ్ర ముప్పు తప్పింది! ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తూ ఆరుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 2,000 పై చిలుకు తూటాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇవి చాలావరకు విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక తూటాలని తేల్చారు.

నిందితులను యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన అజ్మల్‌ (20), రషీద్‌ అలియాస్‌ లలన్‌ (20), సద్దాం, ఢిల్లీకి చెందిన కమ్రాన్, రూర్కీకి చెందిన నాసిర్, డెహ్రాడూన్‌కు చెందిన పరీక్షిత్‌ నేగిగా గుర్తించారు. ఓ ఆటో డ్రైవర్‌ అందించిన సమాచారం మేరకు వీరిని పట్టుకున్నట్టు అదనపు పోలీస్‌ కమిషనర్‌ విక్రంజీత్‌సింగ్, డీసీపీ ప్రియాంక కశ్యప్‌ శుక్రవారం మీడియాకు చెప్పారు. ‘‘ఆనంద్‌ విహార్‌ బస్టాప్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు భారీ బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నట్టు 6న సాయంత్రం సమాచారం అందింది.

దాంతో రంగంలోకి దిగి అజ్మల్‌ ఖాన్, రషీద్‌ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వారి బ్యాగుల్లో తూటాలు దొరికాయి. లక్నోకు చేర్చాల్సిందిగా వాటిని డెహ్రాడూన్‌లోని ఓ వ్యక్తి వాటిని ఇచ్చినట్టు విచారణలో వెల్లడించారు. వీళ్లు గతంలో కనీసం నాలుగుసార్లు ఇలా ఆయుధాలను చేరవేసినట్టు తేలింది. వారి సమాచారం ఆధారంగా లక్నో, జౌన్‌పూర్‌ తదితర చోట్లMమిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. నేగి డెహ్రాడూన్‌లో ఆయుధ డెన్‌ నిర్వహిస్తున్నాడు.

చాలాకాలంగా ఆయుధాలు, మందుగుండు చేరవేశాడు. అనుమానం రాకుండా ఆయుధ రవాణాకు ఈ ముఠా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టునే వాడుకుంటోంది’’ అని వెల్లడించారు. ఉగ్ర కోణాన్నీ కొట్టిపారేయలేమన్నారు. మరోవైపు కోల్‌కతాలో ప్రఖ్యాత విక్టోరియా మెమోరియల్‌ హాల్, పరిసర ప్రాంతాలను డ్రోన్‌తో ఫొటోలు తీస్తున్న ఇద్దరు బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహీకి చెందిన వారిగా గుర్తించారు. కోర్టు వారిని ఆగస్టు 23 దాకా పోలీసు కస్టడీకి అప్పగించింది. ఆర్మీ తూర్పు కమాండ్‌ ప్రధాన కార్యాలయమైన ఫోర్ట్‌ విలియంకు విక్టోరియా హాల్‌ కూతవేటు దూరంలోనే ఉంటుంది!

పతంగులపై నిషేధం
స్వాతంత్య్ర వేడుకలు జరిగే చారిత్రక ఎర్రకోట ప్రాంతంలో సున్నిత ప్రాంతాలపై నిఘాను తీవ్రతరం చేశారు. ఆ పరిసరాల్లో శనివారం నుంచి సోమవారం దాకా పతంగులు, బెలూన్లు, డ్రోన్ల వంటివాటిని ఎగరేయడాన్ని నిషేధించారు. రాడార్లనూ రంగంలోకి దించారు. ఇప్పటికే ప్రకటించిన, మొదలైన పతంగుల పోటీలు తదితరాలను ఆగస్టు 15 సాయంత్రం నుంచి నిర్వహించుకోవాలని సూచించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top