దైవ దర్శనమే యమపాశమైంది.. నదిలో మొసలి దాడిలో భక్తులు మృతి!

Crocodile Attack Devotees Crossing Chambal River In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నది దాటుతున్న భక్తులపై నీటిలో ఉన్న మొసలి దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు వ్యక్తులు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది భక్తులు రాజస్థాన్‌లోని కైలా దేవీ ఆలయానికి వెళ్లి మొక్కలు చెల్లించుకునేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో శివపురి జిల్లాలోని చిలవాడ్‌ గ్రామంలో ఉన్న చంబల్‌ నది వద్దకు చేరుకున్నారు. అయితే, వారు అక్కడికి వెళ్లిన సమయానికి నది దాటేందుకు వంతెన, పడవ అందుబాటులో లేకపోవడంతో వారు చంబల్‌ నదిని దాటేందుకు ప్రయత్నించారు. 

ఈ సందర్భంగా వారంతా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నదిలోకి దిగి గట్టు దాటేందుకు ముందుకు సాగారు. ఇంతలో అక్కడే నాచులో నక్కి ఉన్న మొసలి ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. దీంతో, వారంతా భయంతో నదిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సయమంలో నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. స్థానికంగా ఉన్న వారు మొసలి దాడిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్‌.. ఎనిమిది మందిలో ముగ్గురు మృతదేహాలను వెలికి తీసింది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే, వారిలో మొసలి ఎంత మందిని పొట్టనపెట్టుకుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతయ్యారు. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top