‘కరోనా’ ఒత్తిడిలో భార్యను చంపాడట!

Court Spread Killer Husband - Sakshi

కనికరించిన క్రౌన్‌ కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లోని ఇప్స్‌విచ్‌ నగరానికి సమీపంలోని బర్హామ్‌కు చెందిన షాట్‌ గన్‌ లీడర్‌ పీటర్‌ హాట్‌షోర్న్‌ జోన్స్‌ (51) గత మే నెలలో ఘోరానికి పాల్పడ్డారు. 17వ శతాబ్దానికి చెందిన తన ఫామ్‌ హౌజ్‌లో ఇద్దరు చిన్న పిల్లలు కలిగిన తన భార్య సిల్కీ జోన్స్‌ (41)ను లైసెన్స్‌ కలిగిన 12 బోర్‌ షాట్‌ గన్‌తో రెండు సార్లు ఛాతిపై కాల్చి హత్య చేశారు. ఈ నేరానికి ఆయనకు కఠిన శిక్ష పడుతుందని స్థానిక ప్రజలు భావించారు. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల మానసిక ఒత్తిడి పెరిగి ఏం చేస్తున్నానో తెలియని అయోమయ పరిస్థితుల్లో తన భార్యను చంపుకున్నానని నిందితుడు పీటర్‌ మొరపెట్టు కోవడంతో కేసును విచారించిన ఇప్స్‌విచ్‌ క్రౌన్‌ కోర్టు కనికరించింది.

ముక్కు పచ్చలారని ఇద్దరి పిల్లల ముందే భార్యను చంపావా? అని ప్రాన్స్‌క్యూటర్‌ అడిగిన ప్రశ్నకు లేదని పీటర్‌ సమాధానం ఇచ్చారు. చనిపోయిన తర్వాత పిల్లలు చూశారని చెప్పారు. పిల్లల ముందే భార్యను చంపడం నిజమా, కాదా ? అని దర్యాప్తు జరిపిన పోలీసు అధికారిని ప్రశ్నించగా, తమకు సరిగ్గా తెలియదని,  కాల్పులు జరిపిన గంట తర్వాత నిందితుడే 999 నెంబర్‌కు ఫోన్‌చేసి చెప్పగా, రక్తం మడుగులో పడి ఉన్న భార్యను ఆస్పత్రికి పంపించామని, షాట్‌గన్‌ స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఆ రోజు ఉదయం 6.40 గంటలకు సిల్కీ జోన్స్‌ మరణించారని వివరించారు. పిల్లల ముందే భార్యను కాల్చి చంపితే కూడా పీటర్‌కు కఠిన శిక్ష పడేది.

మే 3వ తేదీ తెల్లవారుజామన 4.45 సమయంలో పీటర్‌ పోలీసులకు ఫోన్‌చేసి చెప్పారు. తన భార్యను తానే కాల్చి చంపినట్లు ముందుగా ఫోన్లో స్వయంగా అంగీకరించిన పీటర్‌ ఆ తర్వాత పోలీసుల ఇంటరాగేషన్‌లో మాట మార్చారు. ఆగంతకుడెవరో కాల్చారన్నారు. ఆ తర్వాత తనను ఆవహించిన ఏదో శక్తి కాల్చిదన్నారు. ఇంతకు తాను కాల్చాడా, ఆగంతకుడు కాల్చాడా? అంటూ పలుసార్లు అటు ఇటు మాట్లాడారు. బుధవారం నాడు ఇప్స్‌విచ్‌ కోర్టు ముందు ముందుగా ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేసిన పీటర్, చివరికి మానసిక ఒత్తిడిలో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (ఐటీ కంపెనీకి లీగల్‌ అడ్వైజర్‌)’ చేస్తోన్న భార్యను తానే కాల్చానని ఒప్పుకున్నారు.

తన మానసిక ఒత్తిడిని పరిగణలోకి తీసుకొని కఠిన శిక్ష విధించవద్దని మొర పెట్టుకున్నారు. ఈయన మొరతోపాటు హత్యా సమయంలో నేరస్థుడి మనస్థితి సరిగ్గా లేదంటూ కన్సల్టెంట్‌ సైక్రియాట్రిస్ట్‌ ఫ్రాంక్‌ ఫర్నాహామ్‌ ఇచ్చిన నివేదికను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. అందుకనే హత్యానేరం కింద కేసును విచారించకూడదని కోర్టు నిర్ణయించింది. ఎన్నేళ్లు జైలు శిక్ష విధించాలనే అంశంపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని కేసు విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు వైద్యుల సూచన మేరకు నిందితుడు క్రమం తప్పకుండా మానసిక వైద్యానికి మందులు వాడాలని సూచించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top